పుష్ప-2కు రీషూట్లు

ఒకప్పుడు ఏదైనా పెద్ద సినిమాకు సంబంధించి రీషూట్లు జరుగుతున్నాయి అంటే అభిమానులు కంగారు పడిపోయేవాళ్లు. తీసిన సీన్లే మళ్లీ తీస్తున్నారంటే సినిమా ఏదో తేడా కొడుతోందనే సంకేతాలు వెళ్లేవి. రీషూట్లు చేయడాన్ని నెగెటివ్ సెంటిమెంట్‌గా చూసేవాళ్లు. కానీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి సినిమాలకు రీషూట్లు చేయడం ద్వారానే బెటర్ ఔట్ పుట్ తీసుకువచ్చి ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడంతో ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకుల ఆలోచన తీరు మారింది.

ఏదైనా సన్నివేశం బాలేకుంటే రీషూట్ చేసి దాన్ని మెరుగు పరిస్తే సినిమాకు మంచే తప్ప చెడేముంది అనే భావన మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఔట్ పుట్ విషయంలో ఏ మాత్రం అసంతృప్తి ఉన్నా రీషూట్లకు వెళ్తున్నారు. తాజాగా ‘పుష్ప-2’ టీం కూడా ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం.

పుష్ప-2 విడుదలకు ఇంకో 75 రోజులే సమయం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఈపాటికి షూటింగ్ అంతా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండాలి. కానీ ఇంకా కూడా షూట్ పూర్తి కాలేదు. దాదాపుగా టాకీ పార్ట్ అంతా అయిపోయినప్పటికీ.. కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారట.

స్వయంగా అల్లు అర్జునే తాను చేసిన కొన్ని సన్నివేశాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ అవి చేద్దామని అనడంతో ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఆ సీన్లను రీషూట్ చేస్తున్నట్లు తెలిసింది. ఇది కాక కొన్ని రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలుందట. రెండు మూడు వారాల్లో ప్యాచ్ వర్క్ అంతా అవగొట్టి గుమ్మడికాయ కొట్టేయాలని టీం చూస్తోంది. తర్వాతి రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా పూర్తి చేసి ‘పుష్ప’ తరహాలో కాకుండా హడావుడి లేకుండా ప్రశాంతంగా సినిమాను రిలీజ్ చేయాలని సుక్కు అండ్ కో భావిస్తోంది.