బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంది…కానీ

మొన్న శుక్రవారం విడుదలైన మూడు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కొంత ఊపిరి పీల్చుకుంటోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి టాక్ ఆశించిన స్థాయిలో రాకపోయినా మాస్ కంటెంట్ మూలంగా ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి.

రెండో రోజు తగ్గుదల కనిపిస్తున్నా డీసెంట్ రెవెన్యూస్ నమోదవుతున్నాయని బయ్యర్ల టాక్. సోమవారం నుంచి అసలు పరీక్ష మొదలుకానుంది. భజే వాయు వేగం మొదటి రోజు చాలా నెమ్మదిగా మొదలై రెండో రోజు నుంచి పికప్ చూపిస్తోంది. ఇది మంచి పరిణామం. గంగం గణేశా విషయంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మూడో స్థానంతో సరిపెట్టుకోవాలి.

సరే ఎక్కువో తక్కువో థియేటర్లలో జనాలు బాగానే కనిపిస్తున్నారని సంతోషిస్తున్న టైంలో నిన్న సాయంత్రం వెలువడిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి.

జూన్ 4 ఎవరు అధికారంలోకి వస్తారనే దాని మీద వివిధ ఏజెన్సీలు చేసిన సర్వేలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆధిక శాతం కూటమి వైపే మొగ్గు చూపగా వైసిపికి అనుకూలంగా కొన్ని రావడం కొంత అయోమయాన్ని పెరింది. ఈ నేపథ్యంలో రకరకాల విశ్లేషణలతో పాటు బుకింగ్ రాయుళ్ల దందాలు, ట్విట్టర్ లో కవ్వింపులు, శుభాకాంక్షలు వగైరాలతో పార్టీల అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాల మీద మూడ్ కాస్తా పోల్స్ వైపు వచ్చేసింది. ఎల్లుండే ఫలితాల వెల్లడి కావడంతో ఈ వేడి రేపు కూడా ఉంటుంది. మంగళవారం జనాలు టీవీ సెట్ల నుంచి పక్కకు జరగడం కష్టం. అలాంటిది థియేటర్లో పబ్లిక్ ని ఎక్కువ ఆశించలేం. అందులోనూ యునానిమస్ గా దేనికైనా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఉంటే ఏమో అనుకోవచ్చు.

కానీ మూడూ యావరేజ్ లేదా ఎబోవ్ యావరేజే అనిపించుకున్నాయి కాబట్టి అద్భుతాలు జరిగే సూచనలు లేనట్టే. పోలింగ్ అవ్వగానే జూన్ 7న మనమే, సత్యభామ, లవ్ మౌళి క్యూ కడుతున్నాయి. సో రెండో వారంని విశ్వక్, కార్తికేయ, ఆనంద్ హోల్డ్ చేసుకోవడం కొంత సవాలే.