యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్లో చాలా ముఖ్యమైన సినిమా.. మనమే. ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ వచ్చిన శర్వా.. చాలా ఏళ్ల నుంచి నిఖార్సయిన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. జాను, పడి పడి లేచె మనసు, రణరంగం, ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇలా చాలానే డిజాస్టర్లు పడ్డాయి అతడికి.
‘ఒకే ఒక జీవితం’ ఓ మాదిరిగా ఆడినా.. అది కూడా పూర్తి సంతృప్తినివ్వలేదు. దీంతో ‘మనమే’ మీద చాలా ఆశలతో ఉన్న శర్వా.. ఇది కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు.
మురారి, ఖుషి లాంటి బ్లాక్‌బస్టర్లతో ‘మనమే’ చిత్రాన్ని శర్వా పోల్చడం విశేషం. హీరో హీరోయిన్లు కొట్టుకునే సినిమాలన్నీ చాలా బాగా ఆడతాయని చరిత్ర చెబుతోందని.. ‘మనమే’ విషయంలోనూ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని శర్వా చెప్పాడు.
‘‘ఈసారి కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం. సినిమా మామూలుగా ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ట్రైలర్లో హీరో హీరోయిన్లు ఎలా ఒకరిని ఒకరు మాటలు అనుకున్నారో.. గొడవ పడ్డారో చూశారు కదా. ఇలా హీరో హీరోయిన్లు గొడవపడ్డ సినిమాలన్నీ కూడా తెలుగులో బ్లాక్‌బస్టర్లే అయ్యాయి. మురారి, ఖుషి.. ఇలా చాలా సినిమాల్లో ఇది రుజువైంది. ‘మనమే’ కూడా అదే తరహాలో బ్లాక్‌బస్టర్ అవుతుంది.
నా కెరీర్లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా ‘మనమే’ నిలుస్తుంది’’ అని శర్వా ‘మనమే’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ధీమా వ్యక్తం చేశాడు. శర్వా సరసన కృతి శెట్టి కథానాయికగా నటించిన ‘మనమే’ను ‘భలే మంచి రోజు’; ‘దేవదాస్’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రూపొందించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ మీద విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates