ఒకప్పటి లెజెండరీ సంగీత దర్శకులు ఇప్పటి తరానికి తగ్గట్టు సంగీతం అందివ్వడం చాలా కష్టం. జెనరేషన్ మారిపోవడం వల్లనో లేదా కొత్త టాలెంట్ కి ధీటుగా ట్యూన్లు ఇవ్వలేకపోవడం వల్లనో కారణం ఏదైతేనేం త్వరగా రిటైర్ మెంట్ తీసుకున్న వాళ్ళు చాలానే ఉన్నారు.
పాతికేళ్ల క్రితం ఆడియో మార్కెట్ ని ఊపేసిన కోటి, ఎస్ఏ రాజ్ కుమార్, దేవా లాంటి వాళ్ళు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయి రియాలిటీ షోలకు జడ్జీలుగా మారిపోయిన వైనం చూస్తున్నాం. కీరవాణి సైతం రాజమౌళికి తప్ప బెస్ట్ వర్క్ ఇచ్చిన దాఖలాలు తక్కువ. కానీ రెహమాన్ మాత్రం వీళ్లందరికి భిన్నంగా డిమాండ్ లో ఉండటం షాకే.
ప్రస్తుతం రెహమాన్ తెలుగులో రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ సందీప్ కిషన్ రాయన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రన్బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న రామాయణం బాధ్యతలు ఆయనకే అప్పగించబోతున్నారు.
కమల్ హాసన్ మణిరత్నం తగ్ లైఫ్, జయం రవి జీనీ, బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లాహోర్ 1947, ధనుష్ మరో మూవీ తేరే ఇష్క్ మేన్, విక్కీ కౌశల్ రష్మిక మందన్నల చావా అన్నీ రెహమాన్ ఖాతాలోనే ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు మూడు ఫైనల్ కావాల్సిన స్టేజిలో ఉన్నాయి.
మూడు దశాబ్దాల ప్రస్థానానికి దగ్గరగా ఉన్న రెహమాన్ ఇంత డిమాండ్ లో ఉండటం వల్లే పది కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సైతం నిర్మాతలు వెనుకాడటం లేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పటి బొంబాయి, ప్రేమికుడు, భారతీయుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నా ఆయనతో పని చేయించుకోవడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఉప్పెనకు దేవిశ్రీ ప్రసాద్ తో బెస్ట్ ఆల్బమ్ రాబట్టుకున్న బుచ్చిబాబు మరి రెహమాన్ ఎలాంటి పాటలు చేయించుకున్నాడో వేచి చూడాలి. మూడు రికార్డింగ్ అయిపోయాయి. షూటింగ్ కు ముందే మొత్తం సాంగ్స్ సిద్ధమవుతాయని టాక్.