వి.వి.వినాయక్‌కు ఏమైంది?

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుల్లో వి.వి.వినాయక్ ఒకరు. రాజమౌళి కంటే ముందు ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్‌ అయ్యారు. చాలా ఏళ్ల పాటు టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడిగా వెలిగారు. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ మధ్య తెలుగులో సినిమాలే తీయడం మానేశారు.

ఐతే పూర్తిగా లైమ్ లైట్లో లేకుండా పోయిన వినాయక్ గురించి కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో, వెబ్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని.. ట్రీట్మెంట్ నడుస్తోందని వార్తలు వచ్చాయి. దీని గురించి వినాయక్ వైపు నుంచి ఏ స్పందనా లేదు.

కాగా శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని వినాయక్ ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. కృష్ణతో తన అనుబంధం గురించి.. ఆయన సినిమాలకు దర్శకత్వ విభాగంలో పని చేయడం గురించి ఆయన ఈ వీడియోలో మాట్లాడారు.

ఐతే వినాయక్ పర్టికులర్‌గా ఇప్పుడీ వీడియో రిలీజ్ చేయడంలో కృష్ణకు నివాళి అర్పించడం మాత్రమే కారణం కాకపోవచ్చు. తన అనారోగ్యం గురించి క్లారిటీ ఇవ్వడానికి కూడా ఆయన ఈ వీడియో వదిలి ఉంటారని భావిస్తున్నారు.

ఐతే ఈ వీడియోలో వినాయక్ కొంచెం డల్లుగానే కనిపించారు. ఎక్కువ మాట్లాడలేకపోయారు కూడా. కానీ తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న స్థితిలో అయితే ప్రస్తుతం లేనని వినాయక్ చెప్పకనే చెప్పారు. ఐతే వినాయక్‌లో డల్‌నెస్ చూస్తే మాత్రం ఆయన మునుపటంత ఉత్సాహంగా లేరని.. కొంత ఇబ్బంది పడుతున్నారని మాత్రం అర్థమవుతుంది.

వినాయక్ చివరగా హిందీలో ‘ఛత్రపతి’ రీమేక్ డైరెక్ట్ చేశారు. దానికి ముందు, తర్వాత తెలుగులో ఓ సినిమా చేయాలని ప్రయత్నించారు కానీ.. ఏదీ కుదరడం లేదు. గతంలో ‘సీనయ్య’ పేరుతో వినాయక్ హీరోగా ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే.