పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ తప్పేలా లేదు. ఓజి విడుదల తేదీ సెప్టెంబర్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తుంటే లక్కీ భాస్కర్ ని అదే తేదీకి రిలీజ్ చేస్తున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. రెండు క్లాష్ అయ్యే సమస్యే లేదు. ఎందుకో చూద్దాం. నిర్మాత నాగవంశీకి పవన్ తో అనుబంధం గురించి కొత్తగా చెప్పదేం లేదు. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గానే కాక త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతరంగికుడుగా ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద తలపడాలని చూడడు. సో ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా పవన్ నుంచో డివివి దానయ్య నుంచో స్పష్టమైన సమాచారం వచ్చి ఉండాలి.
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ భాస్కర్ కు వెంకీ అట్లూరి దర్శకుడు. గత ఏడాది ఇదే బ్యానర్ లో ధనుష్ సార్ తో బ్లాక్ బస్టర్ అందించి ఇంకో ఛాన్స్ పట్టేశాడు. తొంబై దశకంలో జరిగిన ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ కథ ఉంటుందని వినికిడి. ఆ మధ్య వదిలిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసింది. కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న లక్కీ భాస్కర్ ను ప్యాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. ఇప్పుడీ పోస్టర్ చూడటం ఆలస్యం పవన్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా అనుమానాలు, నీరసాలు వచ్చేశాయి. ఓజి ఇంకా ఆలస్యమవుతుందనే ఆలోచనే వాళ్లకు కష్టం.
ఓజి వైపు నుంచి స్పష్టత వచ్చేస్తే ఇక ఈ ఇష్యూని ముగించవచ్చు. నిజానికి ఎన్నికలు, ఆ తర్వాత టిడిపి జనసేనకు విజయావకాశాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెంటనే షూటింగుల్లో పాల్గొనే అవకాశాలు తక్కువేనని ముందు నుంచి విశ్లేషణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడదే నిజమయ్యే దిశగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఓజి దర్శకుడు సుజిత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బోలెడు సంగతులు చెప్పి మంచి బూస్టు ఇచ్చిన మూడు రోజులకే ఈ ట్విస్టు జరగడం విశేషం. అయినా డేట్ చెప్పినంత మాత్రాన మాటకు కట్టుబడే వాతావరణం లేదు. సో మార్పులు చేర్పులు లేదనలేం.