తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే.. మామూలుగా వేరే చిత్రాలు పోటీకి రావడానికి భయపడతాయి. చాలా వరకు పవన్ సినిమాలు సోలోగానే రిలీజవుతుంటాయి. అలాంటిది ఇప్పుడు పవన్ సినిమా రిలీజయ్యే రోజే ఒక క్రేజీ మూవీ విడుదలవుతోంది. దానిపై భారీ అంచనాలున్నాయి.
ఆ సినిమా పోటీని పవన్ చిత్రం తట్టుకోగలదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ చిత్రమే.. దురంధర్-2. డిసెంబరులో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ‘దురంధర్’ భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో దీని పార్ట్-2 మీద పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన హైప్ తెచ్చుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘దురంధర్-2’ కోసం ఎంతోమంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో జరుగుతున్నాయి. మరి ‘దురంధర్-2’తో పోటీ పవన్ సినిమా ఇబ్బంది కాదా అని అడిగితే.. ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు.
‘‘ఆదిత్య ధర్ మీద నాకు ఎంతో గౌరవముంది. ఆయన తొలి సినిమా ‘యురి’ చూశా. అతను అత్యున్నత స్థాయి దర్శకుడు. ఐతే ‘దురంధర్-2’ పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సినిమా. దాని జోనర్ పూర్తిగా వేరు. పోటీలో షారుఖ్ ఖాన్ లాంటి హీరో నటించిన ఎంటర్టైనర్ ఉంటే.. మనం కంగారు పడాలి. కానీ దురంధర్-2, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా భిన్నమైన సినిమాలు. కాబట్టి ఇబ్బంది లేదు అనుకుంటున్నా.
పైగా ‘ఉస్తాద్..’ రిలీజ్ డేట్ నేనొక్కడిని తీసుకున్న నిర్ణయం కాదు. అందరం కలిసి డెసిషన్ తీసుకున్నాం. ‘టాక్సిక్’ ఈ నెల 19 నుంచి వాయిదా పడిందని.. వెంటనే ఆ డేట్‌లో వచ్చేద్దామని మేం కొత్త డేట్‌తో పోస్టర్ వేయలేదు. చాలామంది నుంచి మాకు ఫోన్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు, టెక్నీషియన్లు అందరితో మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయమిది.
సంక్రాంతి, సమ్మర్ లాంటి సీజన్లలో ఒకటికి మించి పెద్ద సినిమాలను రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఉగాది, రంజాన్ పండుగలు ఒకేసారి వస్తున్నాయి. సెలవుల అడ్వాంటేజీ ఉంది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో మా సినిమానే వేసుకోవాలనే స్వార్థం మాకు లేదు. రెండు సినిమాలకూ స్కోప్ ఉంది. రెండూ బాగా ఆడతాయనే నమ్మకముంది’’ అని హరీష్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates