నా సామిరంగ దర్శకుడికి ప్రశాంత్ వర్మ ప్రమోషన్

హనుమాన్ తర్వాత చాలా సినిమాల సమీకరణాలు, కాంబోలు మారిపోతున్నాయి. ఇది రిలీజ్ కావడానికి ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాత డివివి దానయ్య గారబ్బాయి కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేస్తూ అధీరా అనే ప్యాన్ ఇండియా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికో చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్స్ ఆగిపోయాయి. హనుమాన్ ఆలస్యం కావడంతో పాటు దాని ప్రమోషన్ల కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో కొంత కాలం కళ్యాణ్ ప్రాజెక్టు హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు దీన్ని ఇంకోవిధంగా సెట్ చేయబోతున్నారని తెలిసింది.

ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం అధీరా బాధ్యతను నా సామిరంగాతో ప్రూవ్ చేసుకున్న డాన్స్ మాస్టర్ కం డైరెక్టర్ విజయ్ బిన్నీకి అప్పగించబోతున్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాధమికంగా జరుపుకున్న చర్చల మేరకు ఆల్మోస్ట్ డీల్ ఓకే అయ్యిందని సమాచారం. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. జై హనుమాన్ స్క్రిప్ట్ పనులతో పాటు రణ్వీర్ సింగ్ తో ప్లాన్ చేసుకున్న బ్రహ్మరాక్షస (ప్రచారంలో ఉన్న టైటిల్) తాలూకు ప్రీ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నాడు. వేరే వాటి మీద దృష్టి పెట్టేంత టైం లేదు. ఈ కారణంగానే అధీరాకు సమయం సరిపోదు.

అందుకే కథ, రచన మొత్తం ప్రశాంత్ వర్మ చేసి డైరెక్షన్ మాత్రం విజయ్ బిన్నీకి ఇవ్వబోతున్నట్టు వినికిడి. అధికారిక ప్రకటన వచ్చే దాకా నిర్ధారణగా చెప్పలేం కానీ నిజమైతే మాత్రం మంచి నిర్ణయం అవుతుంది. నాగార్జునతోనే విజయ్ బిన్నీ ఇంకో సినిమా చేస్తాడనే వార్తలో నిజం లేదని స్పష్టత వచ్చేసింది. అధీరా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఉంటుంది. ఒక పది సినిమాలు చేశాక అందరినీ అవెంజర్స్ లాగా కలుపుతానని గతంలో చెప్పిన తీరులోనే కథా కథనాలు ఉంటాయట. అధీరాతో పాటు మరికొందరు సూపర్ హీరోల కథలను సిద్ధం చేసే ఆలోచన కూడా ప్రశాంత్ వర్మకు ఉందట .