పవన్ 25 రోజులు టైమిస్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాక సినిమాల పరంగానూ మోస్ట్ వాంటెడ్ అనే చెప్పాలి. ఇన్నాళ్లూ రాజకీయాల కోసం తీరిక లేకుండా గడిపాడు. పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం లాంఛనమే అని భావిస్తున్నారు. ఆయన పార్టీ జనసేన కూడా మంచి ఫలితాలే రాబట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా కూటమి విజయ దుందుభి మోగించి అధికారంలోకి వస్తుందని భావిస్తన్నారు. అది జరిగాక పవన్‌ తమ వైపు చూస్తాడని సినీ నిర్మాతలు ఆశగా చూస్తున్నారు.

ఆయన కోసం మూడు చిత్రాల బృందాలు ఎదురు చూస్తున్నాయి. మొదటగా పవన్ ‘ఓజీ’ సినిమానే పూర్తి చేస్తాడనడంలో సందేహం లేదు. ఆ చిత్రానికి సెప్టెంబరు 27న రిలీజ్ డేట్ కూడా ఖరారు చేశారు. ఆ సినిమాను పూర్తి చేశాక పవన్ ఎవరికి కాల్ షీట్స్ ఇస్తాడన్నది ఆసక్తికరం.

ఓవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’; మరోవైపు ‘హరిహర వీరమల్లు’ సినిమాలు పవన్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాయి. ఐతే ఆర్థికంగా చాలా భారాన్ని మోస్తున్న ఏఎం రత్నంకే పవన్ డేట్లు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ చాలా ఏళ్ల నుంచి మేకింగ్ దశలోనే ఉంది. వడ్డీల భారం విపరీతంగా పెరిగి, బడ్జెట్ కూడా పెరిగిపోయినా పవన్ కమిట్మెంట్లను అర్థం చేసుకుని ఓపిగ్గా ఉంటున్నాడు రత్నం. అంతే కాక ఎన్నికల సమయంలో ఆయన జనసేన కోసం కూడా పని చేశారు. దీంతో ‘హరిహర వీరమల్లు’కు త్వరలోనే మోక్షం రావచ్చు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రత్నం మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంబంధించి ఇంకో 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందన్నాడు. చాలా వరకు పవన్ పాల్గొనాల్సిన సన్నివేశాలే. ఈ ఏడాది చివర్లోనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ‘ఓజీ’ సెప్టెంబరు చివర్లో వస్తుంది కాబట్టి.. పవన్ త్వరగా సినిమాను పూర్తి చేస్తే ఏడాది చివర్లో ‘హరిహర వీరమల్లు’ ప్రేక్షకులను పలకరించవచ్చు.