కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్ ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకుని ఆ స్థానంలో జ్యోతికృష్ణ రావడం ఎన్నికల హడావిడిలో అంతగా హైలైట్ కాలేదు కానీ అభిమానుల మధ్య మాత్రం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరగడంతో వాళ్ళు దీని మీద ఆశలు తగ్గించుకుని దృష్టి మొత్తం ఓజి మీద పెట్టారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం ఈ మార్పు గురించి స్పందించారు. ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024లోనే హరిహర వీరమల్లు విడుదలవుతుందని మరోసారి నొక్కి చెప్పడం గమనార్హం.
దర్శకుడి మార్పుపై మాట్లాడుతూ అందరికీ సర్దుబాటు కావాలనే ఉద్దేశంతో క్రిష్ స్థానంలో తన అబ్బాయి జ్యోతికృష్ణ వచ్చాడని, ముందు నుంచి స్క్రిప్ట్ గురించి పూర్తిగా తెలియడం, డైరెక్షన్ లో అనుభవం ఉండటం వల్ల పూర్తి చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. స్వతహాగా తాను, పవన్ కళ్యాణ్ ఇద్దరూ దర్శకులమే కాబట్టి అవసరమైన సలహాలు సూచనలు చేస్తామని అన్నారు. ఇది నిజమే కానీ రత్నంకు పెద్దరికం (మలయాళం రీమేక్) ఒకటే డైరెక్టర్ గా చెప్పుకోదగ్గ సక్సెస్. పవర్ స్టార్ కు జానీ కలిగించిన అనుభవం ఆ తర్వాత ఆ శాఖ నుంచే దూరం జరిగేలా చేసింది.
ఇవన్నీ ఎలా ఉన్నా హరిహర వీరమల్లు మొదటి భాగం ఈ సంవత్సరమే వస్తుందని చెప్పడం సంతోషించే విషయమే అయినా ఓజి కనక సెప్టెంబర్ లో వస్తే అంత తక్కువ గ్యాప్ లో ఇంకో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ చేయడం సాధ్యమేనా అంటే ఏమో ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ ఎన్నికల్లో కూటమి గెలిస్తే కొంత కాలం పవన్ రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అవుతాడు. అదే జరిగితే ఓజికి వెంటనే డేట్లు ఇవ్వలేకపోవచ్చు. అలాంటప్పుడు బాలన్స్ ఉన్న హరిహర వీరమల్లుకి ఇవ్వడం గురించి అనుమానం కలగడం సహజం. దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి అనేలా పరిస్థితులున్నాయి.