గత కొన్ని రోజులుగా బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. నటి హేమతో పాటు హీరో శ్రీకాంత్ కూడా ఈ పార్టీకి హాజరైనట్లు జోరుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఆ ఇద్దరూ ఖండించారు. శ్రీకాంత్ సంగతి ఏమో కానీ.. హేమ వ్యవహారం మాత్రం మీడియాలో రోజూ నానుతోంది. తాను రేవ్ పార్టీకి హాజరయ్యానన్నది పూర్తి అబద్ధమని.. తాను హైదరాబాద్‌లోని ఒక ఫాం హౌస్‌లో చిల్ అవుతున్నానని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.
కానీ హేమ చెబుతున్నది అబద్ధమనేందుకు పలు ఆధారాలు బయటికి వచ్చాయి. రేవ్ పార్టీ జరిగిన చోటి నుంచే హేమ వీడియో తీసి పోస్ట్ చేసినట్లుగా నెటిజన్లు ఆధారాలు బయటపెట్టేశారు. మరోవైపు రేవ్ పార్టీ జరిగినట్లుగా పేర్కొంటున్న రోజు హేమ బెంగళూరుకు విమాన ప్రయాణం చేసిన విషయం కూడా వెల్లడైంది.
ఇంతలో హేమ బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్న సంగతి కూడా బెంగళూరు పోలీసులు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఈ కేసు విషయమై విచారణకు రావాలని బెంగళూరు పోలీసులు హేమకు కొన్ని రోజుల కిందట నోటీసులు పంపడం తెలిసిన సంగతే. కానీ తాను వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నానని.. ఇప్పుడు రాలేనని.. తనకు టైం ఇవ్వాలని హేమ పోలీసులకు తెలిపింది.
కానీ పోలీసులు హేమ వాదన పట్టించుకోకుండా మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈసారి కూడా స్పందించకపోతే హేమను బెంగళూరు పోలీసులు ఇక్కడికి వచ్చి మరీ అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. మరోవైపు ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలకు కూడా ఈ రేవ్ పార్టీతో సంబంధాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ వాళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.