గత కొన్నేళ్లుగా నిర్మాత దిల్ రాజు జడ్జ్ మెంట్ పూర్తిగా లెక్క తప్పుతున్న వైనం బాక్సాఫీస్ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎంతో నమ్మకంగా ప్రమోట్ చేసుకున్న సినిమాలు సైతం డిజాస్టర్లు కావడం ఊహించని పరిణామం. ది ఫ్యామిలీ స్టార్ ని ఏళ్ళ తరబడి గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. కానీ రెండు వారాలు గట్టిగా ఆడలేక చేతులు ఎత్తేసింది. ఆర్య కథ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్ లవ్ మీ ఇఫ్ యు డేర్ కి అనిపించిందని అన్నారు. తీరా చూస్తే మొదటి ఆటకే చాలా స్పష్టంగా పబ్లిక్ తీర్పు వచ్చేసింది. ఇంకోవైపు గేమ్ ఛేంజర్ మూడేళ్ళకి పైగా నిర్మాణంలో ఉండి ఇప్పటికీ రిలీజ్ డేట్ ఖరారు చేసుకోలేదు.
డాన్స్ మాస్టర్ యష్ హీరోగా రూపొందుతున్న ఆకాశం దాటి వస్తావా రీ షూట్ల ప్రహసనంలో ఆలస్యమవుతోందని ఇప్పటికే టాక్ ఉంది. ఆశిష్ హీరోగా సెల్ఫిష్ కొంత భాగం అయ్యాక రషెస్ చూసుకుని ఆపేసి మళ్ళీ రీ షూట్ కి రెడీ అవుతున్నారు. నితిన్ తమ్ముడు విడుదల తేదీ ఇంకా లాక్ కాలేదు. వెంకటేష్, నాని, విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, ధనుష్ లాంటి బడా స్టార్లతో మొదలుకుని సుహాస్ లాంటి అప్ కమింగ్ హీరోస్ ఎన్నో సినిమాలు ఒకేసారి లైన్ లో పెడుతున్న దిల్ రాజు ఇకపై జాగ్రత్తగా ఉండాలంటే లెక్కలు సరిచేసుకోవాలి. అంటే బడ్జెట్ పరంగా కాదు నాణ్యమైన కంటెంట్ పరంగా.
అసలు తప్పెక్కడ జరుగుతోందో చూసుకోవాలి. పోటీలో ఉన్న మైత్రి, సితార, పీపుల్స్ మీడియా లాంటివి దూసుకుపోతున్న టైంలో ఎస్విసిని అవి అందుకోలేనంత స్థాయిలో నిలబెట్టాలంటే విజయాల శాతం ఎక్కువగా ఉండాలి. 2018 నుంచి చూసుకుంటే దిల్ రాజుకి కమర్షియల్ గా పే చేసిన సినిమాలు వకీల్ సాబ్, ఎఫ్2, ఎఫ్3 మాత్రమే. తమిళంలో వరిసు విజయ్ ఇమేజ్ పుణ్యమని లాభాలు తెచ్చింది. మిగిలినవన్నీ మిస్ ఫైర్ అయినవే. శాకుంతలం లాంటివి మాములు దెబ్బ వేయలేదు. తీర్పుల విషయంలో పక్కాగా ఉండే దిల్ రాజు ఇకపై మరింత జాగరూకతతో వ్యవహరించాల్సిందే. రిజల్ట్స్ నేర్పించిన పాఠమిది.