మెగాస్టార్ మమ్ముట్టికి టర్బో షాక్

మనకు మెగాస్టార్ అంటే చిరంజీవి కానీ కేరళలో అదే బిరుదుతో మమ్ముట్టిని పిలుచుకుంటారు. అప్పుడప్పుడు తెలుగులోనూ యాత్ర లాంటి సినిమాలతో పలకరించే ఈ విలక్షణ నటుడు ఇప్పటిదాకా నాలుగు వందల చిత్రాలకు పైగానే నటించారంటే ఆశ్చర్యం కలిగించే విషయం.

త్వరలో అరసహస్రం అందుకోబోతున్న మమ్ముట్టి కొత్త మూవీ టర్బో మొన్న గురువారం రిలీజయ్యింది. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో షోలు వేశారంటేనే మలయాళం సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేందుకు మనవాళ్ళు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ట్విస్ట్ ఏంటంటే ఈ టర్బో బాక్సాఫీస్ కి షాక్ ఇచ్చింది.

ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమ యుగం, గోట్ లైఫ్ ఆడు జీవితం, ఆవేశం ఇలా వరస బ్లాక్ బస్టర్ల దూసుకుపోతున్న మల్లువుడ్ కి టర్బో ఇంకో జోడింపు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరిగేలా లేదు. ముందు కథేంటో చూద్దాం. స్నేహితుల కోసం ఏదైనా చేసే జోస్ (మమ్ముట్టి) ఫ్రెండ్ అడిగాడని అతను ప్రేమించిన ఇందు(అంజనా జయప్రకాశ్) ని తీసుకొస్తాడు.

కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆమెతో పాటు చెన్నై వెళ్లాల్సి వస్తుంది.ఇంకోవైపు ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీనికంతటికి చెన్నై డాన్ వెట్రివేల్ షణ్ముఖ సుందరం (రాజ్ బి శెట్టి) కనెక్షన్ ఉంటుంది. అదేంటో తెరమీద చూడాలి.

యాక్షన్ కామెడీతో క్లాసు మాసుని మెప్పించాలని చూసిన మన్యం పులి ఫేమ్ దర్శకుడు వైశాఖ్ ఇందులో అలాంటి మేజిక్ ని రిపీట్ చేయలేకపోయాడు. రొటీన్ అనిపించే సన్నివేశాలతో పాటు ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగే కథనంతో క్రమంగా ఆసక్తిని తగ్గిస్తూ పోయాడు.

యాక్షన్ మీద విపరీతంగా ఆధారపడటంతో ఒకదశ దాటాక విసుగు పుడుతుంది. సీన్లు వచ్చి వెళ్తుంటాయి కానీ ఎలాంటి ఆసక్తిని పెంచవు. మమ్ముట్టి రాజ్ బి శెట్టిల మొదటి కలయిక కలయిక ఇలాంటి మూవీలో వృథా కావడం నిరాశ కలిగిస్తుంది. డై హార్డ్ ఫ్యాన్స్ కి తప్ప ఈ టర్బో మిగిలినవాళ్లకు ఒకరకమైన టార్చరే.