మొన్న జనవరి దాకా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో, వాళ్ళ మనసుల్లో పెట్టుకున్నది ఓజి ఒక్కటే. దర్శకుడు సుజిత్ తమ హీరోని ఎంత స్టయిలిష్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడోననే అంచనాలతో రోజురోజుకు నమ్మకం పెంచేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే జనసేన టీడీపీ పొత్తు కుదిరాక, పవన్ ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు వరకు ఇదే జరిగింది. ఎప్పుడైతే పిఠాపురం నుంచి అభ్యర్థిగా నిలబడి ప్రచారం వేగం పెంచాడో అప్పటి నుంచి సమీకరణాలు మారిపోయాయి. రాష్ట్ర రాజకీయాలు ఎక్కువ శాతం పిఠాపురంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది.
పవన్ గెలుపు లాంఛనమేనన్నది పలు సర్వేలు, నివేదికలు చెబుతున్న మాట. గత ఎలక్షన్లలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి ఓటమి చెందిన పవర్ స్టార్ కు ఈసారి గెలుపు నల్లేరు మీద నడకని, కనీసం ఎనభై వేల నుంచి లక్ష దాకా మెజారిటీ వచ్చినా ఆశ్చర్యం లేదని స్థానిక టిడిపి నాయకుడు వర్మ చెబుతున్న మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది ఓజి కోసం కాదు. పవన్ కళ్యాణ్ గెలిచాడని మీడియాలో చెప్పే వార్త కోసం. ఆ శుభవార్త రావడం ఆలస్యం ఊరూరా సంబరాలు చేసుకునేందుకు జనసేన వర్గాలతో పాటు ఫ్యాన్స్ అసోసియేషన్లు సిద్ధమవుతున్నాయి.
సో కొన్నిరోజుల పాటు ఈ జోరు ఇంటా బయట కనిపించనుంది. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న దర్శకుడు సుజిత్ పవన్ ఎప్పుడు సెట్లో అడుగు పెట్టినా వెంటనే మొదలుపెట్టేసి వీలైనంత వేగంగా ఓజి షూట్ పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లతో రెడీగా ఉన్నాడు. సెప్టెంబర్ 27 విడుదల తేదీని అందుకోవడం మీదే అనుమాలున్నాయి. జూలైలో కనక స్టార్ట్ కాకపోతే వాయిదా వేసే పరిస్థితి రావొచ్చు. పవన్ మాత్రం ఆలస్యం చేయకూడదనే సంకల్పంతో ఉన్నాడు కానీ రాజకీయ వాతావరణంలో వచ్చే అనూహ్య మార్పులు ఒక నిర్ణయానికి కట్టుబడేలా ఉండనివ్వకపోవచ్చు. చూడాలి ఏం జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates