కళ్యాణ్ రామ్ అమిగోస్ తో టాలీవుడ్ కొచ్చిన కన్నడ భామ ఆషిక రంగనాథ్ కు డెబ్యూనే డిజాస్టర్ రూపంలో పలకరించింది. అయినా నిరాశపడకుండా ఎదురు చూసినందుకు నా సామిరంగ డీసెంట్ హిట్ ఇచ్చింది. నాగార్జున లాంటి సీనియర్ హీరోతో మొహమాటం లేకుండా జోడి కట్టడం దర్శకుల దృష్టిలో పడేలా చేసింది. అలా అని ఆఫర్లు క్యూ కట్టలేదు. తొందరపడి ఏది పడితే అది తనూ ఒప్పుకోలేదు. ఆ నిరీక్షణకు తగ్గట్టు చిరంజీవి విశ్వంభరలో ఛాన్స్ కొట్టేసింది. ఇది ముందే లీకైన న్యూస్ అయినప్పటికి తాజాగా అధికారిక ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చారు.
అసలు విశేషాలు వేరే ఉన్నాయి. విశ్వంభరలో త్రిష హీరోయిన్. చిరు పోషించే పాత్ర కథ ప్రకారం వేర్వేరు లోకాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడో అప్సరసగానో దేవత లాంటి పాత్రలోనో ఆషిక రంగనాథ్ కనిపించనుంది. మొదటిసారి చుట్టూ గ్రీన్ మ్యాట్ ఉన్న సినిమా చేస్తున్నానని, ఈసందర్భంగా మెగాస్టార్ ఇస్తున్న సలహాలు, సూచనలు చాలా ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చింది. ఏదైనా పాట ఉంటుందా లేదానే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జోడిగా కాకపోయినా కీలక మలుపులో తన క్యారెక్టర్ ఉంటుందని ఆశికా చెప్పడం చూస్తే చెప్పుకోదగ్గ ప్రాధాన్యమే ఉండొచ్చు.
సగం దాకా షూటింగ్ జరుపుకున్న విశ్వంభర జూలై చివరి లోపు చిత్రీకరణ పూర్తి చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. దర్శకుడు విశిష్ట పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నాడు. బింబిసారని మించిన గ్రాండియర్ కావడంతో దానికి రాజీ పడిన అంశాలకు ఇందులో చోటు లేకుండా బాగా కష్టపడుతున్నాడని ఇన్ సైడ్ టాక్. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు ఛాయాగ్రహణం అందిస్తుండగా చిరు పాత్ర పేరు భీమవరం దొరబాబని ఇంతకు ముందే లీక్ వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10 విడుదల కాబోతున్న విశ్వంభర పండగని ఎప్పుడో లాక్ చేసుకుంది.