ఢిల్లీ కోర్టులో రకుల్ వేసిన పిటిషన్ ఏమైంది?

టాలీవుడ్ లో మరే హీరోయిన్ ఎదుర్కొని చిత్రమైన పరిస్థితిని రకుల్ ప్రీత్ సింగ్ ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్.. తదనంతరం రియా చక్రవర్తి ఎపిసోడ్.. డ్రగ్స్ వినియోగం లాంటి ఇష్యూలోకి రకుల్ పేరు అనూహ్యంగా వినిపించటం తెలిసిందే. దీంతో.. రియాక్టు అయిన ఆమె.. తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. మీడియాలో తన పేరును బద్నాం చేస్తున్నట్లుగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

అక్కడితో ఆగని ఆమె.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో తన పేరును అనవసరంగా ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వాటికి చెక్ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తమ వైఖరిని వెల్లడించాలని కోరుతూ.. కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖకు.. ప్రసారభారతికి.. ప్రెస్ కౌన్సెల్ కు.. న్యూస్ బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదిస్తూ.. రకుల్ కోరుకున్నట్లుగా ఇంజంక్షన్.. బ్లాంకెట్ బ్యాన్ లాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరారు. కోర్టుకు వచ్చే ముందు ఆమె ప్రభుత్వానికి కానీ.. సంబంధించిన వర్గాల వారికి కానీ ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఏ ఒక్క మీడియా హౌస్ కానీ.. చానల్ గురించి కానీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన రకుల్ న్యాయవాది తన వాదనల్ని వినిపిస్తూ.. రియా చక్రవర్తి తాను రకుల్ పేరు చెప్పలేదని చెప్పిన తర్వాత కూడా.. తన క్లయింట్ పేరును డ్రగ్స్ కేసుతో లింక్ చేస్తూ రాస్తున్నారని పేర్కొన్నారు. దీంతో స్పందించిన న్యాయమూర్తి నోటీసులు జారీ చేయటంతో పాటు.. ఈ పిటిషన్ పై విచారణను అక్టోబరు 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటిలోపు మరెన్ని పరిణామాలు చొటు చేసుకుంటాయో చూడాలి.