కాజల్‌‌కిది చాలా ప్రెస్టీజియస్

తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని స్టార్‌డమ్ అనుభవించిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఐతే ఎలాంటి హీరోయిన్‌కైనా ఒక దశ తర్వాత కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గడం.. దీంతో కెరీర్ చరమాంకంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు అడుగులు వేయడం మామూలే. ఆ తరహా చిత్రాల్లో కొంతమందే విజయవంతం అవుతారు. కాజల్ అగర్వాల్‌కు ఇప్పటిదాకా ఈ తరహా చిత్రాలు కలిసి రాలేదు.

తెలుగులో చేసిన ‘సీత’, తమిళంలో నటించిన మరో చిత్రం సక్సెస్ కాలేదు. ఆమె తెలుగులో నటించిన ‘క్వీన్’ రీమేక్ అసలు రిలీజే కాకుండా ఆగిపోయింది. కాజల్ కొంచెం గ్యాప్ తర్వాత చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’. ఈ చిత్రం చాన్నాళ్ల పాటు మేకింగ్ దశలో ఉంది. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా విషయంలో కాజల్ చూపిస్తున్న తపన ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. ఇంతకుముందు చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వేిటీ మీదా కాజల్ ఇంత శ్రద్ధ చూపించలేదు. ప్రమోషన్ల పరంగా చాలా కష్టపడుతోంది. బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇస్తోంది. తనతో కలిసి పని చేసిన హీరోలతో సినిమాను ప్రమోట్ చేయించడానికి చూస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నాడు.

సుమన్ చిక్కాల అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ప్రోమోల వరకు చూస్తే ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. ‘గూడఛారి’, ‘మేజర్’ చిత్రాల దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే సినిమా మీద కాజల్ కూడా చాలా ధీమాగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆమె ప్రెస్టీజియస్‌గా తీసుకుని ప్రమోట్ చేస్తోంది. మే 31న రావాల్సిన ‘సత్యభామ’ను ఆ రోజు పోటీ ఎక్కువైందని జూన్ 7కు వాయిదా వేయించడంలోనూ కాజల్ ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తోంది.