ఎంత ప్యాన్ ఇండియా స్టార్ అయినా సరే ఒక హీరో మార్కెట్ హిట్టు ఫ్లాపులకు ప్రభావితం చెంది మారుతూ ఉంటుంది. దానికి అతీతంగా ఫలితంతో సంబంధం లేకుండా బడ్జెట్, బిజినెస్ రెండూ అంతకంతా పెంచుకుంటూ పోతున్న ప్రభాస్ అంతకుమించి అనే స్థాయిలో దూసుకుపోతున్నాడు. దానికి నిదర్శనమే బాహుబలి తర్వాత సాహో నుంచి సలార్ దాకా జరిగిన ప్రయాణం.
ఇప్పుడు కల్కి 2898 ఏడి రాబోతోంది. జూన్ 27 విడుదలలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. నిన్న రామోజీ ఫిలిం సిటీలో జరిగిన బుజ్జి లాంచ్ లో ప్రభాస్ ని పరిచయం చేసిన విధానం, అన్న మాటలు ఫ్యాన్స్ ని తాకాయి.
అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటీనటులతో కలిసి నటించడం తన అదృష్టంగా పేర్కొన్న ప్రభాస్ వాళ్లకు మనసారా కృతజ్ఞతలు చెప్పాడు. అక్కడితో ఆగలేదు. దీపికా పదుకునేని లేడీ సూపర్ స్టార్ గా సంబోధించి దిశా పటానిని సైతం థాంక్స్ చెప్పాడు.
ఇదేమీ పెద్ద విషయం కాదని కొందరికి అనిపించవచ్చేమో కానీ ఇక్కడ పేర్లు ప్రస్తావించిన వాళ్ళు ప్రత్యక్షంగా వేడుకలో లేకపోయినా అదే పనిగా గుర్తు చేసుకోవడం సంస్కారమే. తిరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళతో పాటు పాల్గొనే ఛాన్స్ వస్తుందని తెలిసినా డార్లింగ్ అప్పటిదాకా ఆగకుండా తన మనసులో ఫీలింగ్స్ చెప్పుకున్నాడు.
నిన్నటి ఈవెంట్, బుజ్జి టీజర్ లాంచ్ తో ఒక్కసారిగా కల్కి మీద అంచనాల పర్వం ఇంకా పెరిగిపోయింది. ఇది కేవలం ప్రభాస్ వాడిన కారు తాలూకు ఇంట్రోనే కాబట్టి అసలైన టీజర్, ట్రైలర్ లో గూస్ బంప్స్ విజువల్స్ ని ఆశించవచ్చు.
దర్శకుడు నాగఅశ్విన్ మీద నమ్మకంతో అయిదు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేశారు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కావడం ఖాయమనే నమ్మకంతో ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కల్కిని మార్కెట్ చేసేందుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. కనివిని ఎరుగని రిలీజ్ ఉండబోతోంది .