కల్కి పరిచయం – బుజ్జి కారులో బుజ్జిగాడు

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన కల్కి 2898 ఏడి బుజ్జి లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా జరిగింది. ముందు యాభై వేలకు పైగా ఫ్యాన్స్ వస్తారని ప్రచారం జరిగినా అనుమతులు, స్థలాభావం దృష్ట్యా దాన్ని పరిమితం చేశారు. దీంతో ఆహ్వానాలు అందిన డార్లింగ్ ఫాలోయర్స్ తో పాటు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. వైజయంతి మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రాలేని వాళ్లకు స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచారు. ఊహించినట్టే కథలో కీలక పాత్ర పోషించిన బుజ్జి కారులో బుజ్జిగాడి ఎంట్రీతో ఈవెంట్ జరుగుతున్న ప్రాంగణం దద్దరిల్లిపోయింది.

ప్రభాస్ పోషించిన భైరవ క్యారెక్టర్ కు ఈ బుజ్జి కారు చాలా బలమైన కనెక్షన్ ఉన్నట్టు ఇవాళ జరిగిన హంగామాతో అర్థమైపోయింది. మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య చుట్టూ వేలాది కళ్ళు వీక్షిస్తుండగా డార్లింగ్ స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ దాన్ని రౌండ్లతో గిరగిరా తిప్పడం వెరైటీగా అనిపించింది. దాన్నుంచి దర్జాగా బయటికి దిగిన తర్వాత తన మనసులో మాటలు పంచుకున్నాడు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే తదితరులకు థాంక్స్ చెప్పడమే కాక ఇంత ప్రేమ చూపిస్తున్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపాడు. వైభవంగా జరిగిన ఈ వేడుక ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

ఇన్స్ టా వేసిన టెంప్టింగ్ ట్వీట్ తో మొదలుపెట్టి పలు కబుర్లు పంచుకున్న ప్రభాస్ పెళ్లి విషయాన్ని మాత్రం మళ్ళీ తెలివిగా దాటవేశాడు. ఇప్పటి దాకా జరిగిన ప్రమోషన్లన్నీ దిగదుడుపే అన్నరీతిలో బుజ్జి లాంచ్ స్పెషల్ గా జరిగిపోయింది. విడుదలకు ఇంకో ముప్పై అయిదు రోజులే ఉన్న నేపథ్యంలో ఇకపై పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతున్నారు. దర్శకుడు నాగఅశ్విన్ టీమ్ ప్రత్యేక ప్లాన్లు సిద్ధం చేసుకుంటోంది. కల్కి కోసం సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన బీట్స్ తో వేయించిన డాన్స్ మెడ్లీ ఆకట్టుకుంది. మొత్తానికి కల్కి ప్రచారంలో మొదటి అడుగు ఘనంగా గర్వంగా పడిపోయింది.