రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు 50 వేల నుంచి లక్ష దాకా భారీగా అభిమాన సందోహం వస్తారనే నేపథ్యంలో నిర్వాహకులు కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్ తన సినిమా కోసం పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చి నెలలు గడిచిపోయాయి. ఆదిపురుష్ కి తిరుపతి వచ్చాక సలార్ కోసం ఈ రేంజ్ ఈవెంట్ చేయలేదు. అందుకే కల్కికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, తమిళనాడు నుంచి వస్తున్నారు. ఫ్యాన్ అసోసియేషన్లకు ప్రత్యేకంగా బుజ్జి బొమ్మతో కూడిన ఇన్విటేషన్లు రెండు రోజుల క్రితమే వెళ్లాయి.
ఇప్పటిదాకా కల్కి బృందం ప్రమోషన్ పరంగా చేసింది తక్కువ. ఇదే అతి పెద్దది కావడంతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా మూవీ లవర్స్ కళ్లన్నీఎలా జరుగుతుందనే దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కథలో కీలక పాత్ర పోషిస్తున్న బుజ్జి టీజర్ తో పాటు ప్రభాస్ పోషించే భైరవని కూడా ఈ వీడియో ద్వారానే పరిచయం చేస్తారని తెలిసింది. ఎవరెవరు వస్తారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీపికా పదుకునే హాజరు అనుమానంగా ఉండగా దిశా పటాని కన్ఫర్మని టాక్. కమల్ హాసన్ అందుబాటులోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తీసుకొచ్చే ప్లాన్ ఉందట.
ఏమైనా రేపు స్టేజి మీద చాలా సర్ప్రైజ్ లు ఉండటం ఖాయమని టీమ్ సభ్యులు అంటున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచే సందడి చేయబోతున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుందని వార్త. జూన్ 27 విడుదల కాబోతున్న కల్కి 2898 ఏడికి కేవలం 36 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల ఫలితాల హడావిడికి ఒక నాలుగైదు రోజులు మినహాయిస్తే మిగిలిన నెల రోజులు ఆకాశమే హద్దుగా పబ్లిసిటీ చేయాలి. వరల్డ్ వైడ్ రిలీజ్ కావడంతో ఓవర్సీస్ లో షాకింగ్ నెంబర్లు నమోదు కాబోతున్నాయి. లక్కీగా ఈసారి చెప్పుకోదగ్గ హాలీవుడ్ పోటీ లేకపోవడం సానుకూలాంశం.