బ్రహ్మరాక్షస వెనుక ఏం జరుగుతోంది

హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికిది అఫీషియల్ గా లాంచ్ కాలేదు. ముందు ఫోటో షూట్, టీజర్ తీసి వాటి ద్వారా మీడియాకు, అభిమానులకు చెప్పాలనుకున్నారు. నిన్నటిదాకా జరిగింది ఇదే. కానీ అనూహ్యంగా ఇప్పుడిది హోల్డ్ లో పెట్టారని, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా పేర్కొంటూ ముంబై మీడియాలో కథనాలు రావడం సంచలనం రేపుతోంది. ఇటు డైరెక్టర్ తరఫున వర్గాలు మాత్రం అలాంటిదేమి లేదని అనుకున్నట్టుగానే జరుగుతుందని చెబుతున్నాయి.

ఏదో రైటో వెంటనే తేలకపోవచ్చు. హనుమాన్ చూశాక రణ్వీర్ ఒక్కసారిగా స్పెల్ బౌండ్ అయిపోయి ప్రశాంత్ వర్మకు ఫ్యాన్ గా మారాడు. దానికి తగ్గట్టే ఇతనికి సరిపడా కథ ఉండటంతో పట్టాలు ఎక్కేసింది. బ్రహ్మరాక్షస టైటిల్ కూడా లీకైపోయింది. అసలు అధికారిక ధృవీకరణ లేకుండా ఇంత హైలైట్ అయిన ప్యాన్ ఇండియా సినిమాలు రామాయణం తర్వాత ఇదే. ప్రశాంత్ వర్మ అందుబాటులో లేడు. ముంబై, హైదరాబాద్ మధ్య తిరుగుతూ తెగ బిజీగా ఉన్నాడు. రణ్వీర్ సింగ్ దీనికన్నా ముందు కమిటైన డాన్ 3, శక్తిమాన్ లను కాదని బ్రహ్మరాక్షసకు ఓటేయడం బట్టే బలమైన కంటెంటని అర్థమవుతోంది.

హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ జనాలకు ఇదంతా అయోమయానికి గురి చేస్తోంది. మరో టాక్ ఏంటంటే బ్రహ్మరాక్షసను సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా కాకుండా విడిగా తీయమని రణ్వీర్ కోరాడట. దానికి ప్రశాంత్ వర్మ అంగీకరించలేదని అంటున్నారు. నిర్ధారణగా చెప్పలేని విషయమే అయినా నిప్పులేనిదే పొగరాదు తరహాలో ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ అయితే జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు ఇది కనక పెండింగ్ పడితే జై హనుమాన్ పనులు ఊపందుకోవచ్చు. దానికి క్యాస్టింగ్ ని ఎంచుకోవడమే ప్రశాంత్ వర్మకు సవాల్ కానుంది.