నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్ బస్టరో లేక ఫ్లాప్ సాంగో వెంటనే చెప్పలేని రీతిలో చర్చ జరుగుతోంది. విజువల్స్ గట్రా పక్కనపెడితే వాయిద్యాల హోరులో రామజోగయ్యశాస్త్రి రాసిన మంచి సాహిత్యం సరిగా వినిపించలేదనే కంప్లయింట్ మ్యూజిక్ లవర్స్ నుంచి వస్తోంది. స్లో పాయిజన్ లా ఖచ్చితంగా ఇది ఎక్కేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. నాగవంశీ చెప్పినట్టు జైలర్ హుకుంని మర్చిపోయేలా చేయడం జరగని పనేమో కానీ ఒకవేళ సినిమా రిలీజయ్యాక దీని ఇంపాక్ట్ మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఈ పాట గురించి ఇంతగా చర్చ జరగడానికి కారణం లేకపోలేదు. టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీగా బజ్ ఉన్న సినిమాల్లో గేమ్ ఛేంజర్, పుష్ప 2 ది రూల్ నుంచి చెరో పాట వచ్చేశాయి. జరగండితో తమన్ పూర్తిగా సంతృప్తి పరచలేదనే కామెంట్స్ ముందు నుంచే ఉన్నాయి. అందుకే వ్యూస్ పరంగా ఇంకా భారీ రికార్డులు బద్దలవ్వలేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పుష్పరాజ్ టైటిల్ ట్రాక్ ఆశించిన రేంజ్ లో కాకపోయినా అంచనాలకు తగ్గట్టు రీచ్ పెంచుకుంటోంది. షూ స్టెప్పులు, క్యాచీ ట్యూన్లు పని కానిస్తున్నాయి. ఇప్పుడు దేవర ఫియర్ కు వాటితో పోలిక వచ్చింది.
ఒకటి మాత్రం నిజం. అనిరుధ్ రవిచందర్ ని ముందు అనుమానించడం తర్వాత వినేకొద్దీ బాగుందని పొగడటం సాధారణమైపోయింది. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. అక్టోబర్ 10 విడుదల కాబోతున్న దేవరతో జాన్వీ కపూర్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ మొదటిసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కొరటాల శివకు ఇది బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం. ఆర్ఆర్ఆర్ ఇచ్సిన ఇంటర్నేషనల్ మార్కెట్ దేవరతో మరింత పెరుగుతుందని తారక్ నమ్మకం. ఇంత బరువు మోస్తున్న దేవర సంగీతం గురించి ఇంత చర్చ జరగడంలో ఆశ్చర్యం లేదు. రెండో పాట మెలోడీగా ఉంటుందట.