కల్కిలో కమల్ హాసన్ షాకింగ్ నిడివి

ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది. నిరాసక్తంగా ఉంటూ కనీస వసూళ్లు లేక పేషెంట్ లా మారిన థియేటర్లను కిక్కిరిసిపోయేలా చేసే సత్తా దీనికే ఉందని బలంగా నమ్ముతోంది. అంతకన్నా ముందు గ్యాంగ్స్ అఫ్ గోదావరి లాంటి చెప్పుకోదగ్గ సినిమాలు వస్తున్నా అవి ప్యాన్ ఇండియా స్థాయి కాదు కాబట్టి బాలీవుడ్ వర్గాలు సైతం ప్రభాస్ మూవీ మీదే కన్నేశాయి. కమల్ హాసన్ ఉండటం వల్ల సాధారణంగా కనిపించే డిమాండ్ కంటే తమిళనాడు నుంచి ఎక్కువగా రావడం సంతోషించే పరిణామం.

ఇదంతా బాగానే ఉంది కానీ కల్కిలో లోకనాయకుడు పాత్ర నిడివి ఎంత ఉంటుందనే దాని మీద క్లారిటీ లేక ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఆయనే నాది క్యామియో అని చెప్పుకున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కల్కి మొదటి భాగంలో కమల్ కనిపించేది 20 నిమిషాలేనని తెలిసింది. రెండో భాగం గురించి టీమ్ అధికారికంగా చెప్పకపోయినా పార్ట్ టూలో 90 నిమిషాల పాటు ఉంటారని వినికిడి. అంటే క్యారెక్టర్ ని ముందు పరిచయం చేసి అసలైన విశ్వరూపాన్ని కొనసాగింపులో చూపిస్తారన్న మాట. బలంగా లీకైన టాక్ అయితే ఇదే.

సో ప్రభాస్ కమల్ ల మధ్య కాంబో సీన్లు ఎక్కువగా ఉండవని ముందే ప్రిపేర్ అయితే బెటరేమో. ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా అగ్రెసివ్ ప్రమోషన్లు చేయకూడదన్న అశ్వినీదత్ సూచనల మేరకు ప్రస్తుతం పబ్లిసిటీని నెమ్మదిగా చేస్తున్నారు. జూన్ 4 కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అసలు హంగామా మొదలువుతుంది. జనాలు అప్పటిదాకా రాజకీయంగా గెలుపెవరిదనే మూడ్ లో ఉంటారు కాబట్టి సినిమాలను అంత సీరియస్ గా తీసుకోరు. చివరి ఇరవై రోజులను పీక్స్ కు తీసుకెళ్లేలా కల్కి బృందం కష్టపడుతోంది. హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ టార్చ్ బేరర్ అయ్యేలా ఉంది మరి.