యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త హోదాలో అటల్ సేతు బ్రిడ్జ్ ని పొగుడుతూ చేసిన వీడియో ఒకటి పెద్ద చర్చకే దారి తీసింది. అసలు ఇంత హఠాత్తుగా మోడీ సర్కారు మీద ప్రశంసలు గుప్పించేలా ఈ యాడ్ ఎందుకు చేసిందనే కామెంట్స్ వినిపిస్తుండగా, ట్రోలర్స్ ఒక అడుగు ముందుకు వేసి తనకేవో కోట్ల రూపాయల పన్ను బకాయిల సమస్య ఉండటం వల్లే ఆ గండం నుంచి బయట పడేందుకు ఈ ప్రకటనకు ఒప్పుకుందనే తరహాలో చిత్ర విచిత్రమైన కథనాలు సోషల్ మీడియాలో అల్లేస్తున్నారు.
ఇవి నిజం కాకపోయినా సరే నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. సెలబ్రిటీనే కాదు ఎవరికైనా దేని గురించైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. స్టార్లు కాబట్టి వాళ్ళ ప్రతి మాట, చర్య భూతద్దంలో చూస్తారు. ఇటీవలే అల్లు అర్జున్ జస్ట్ ఫ్రెండ్ కి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్తే ఎంత దుమారం రేగిందో చూస్తున్నాం. ఇప్పుడు రష్మిక చర్య కూడా ఇంచుమించు అలాంటి రియాక్షన్లే తెచ్చుకుంటోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ బ్రిడ్జ్ కైన ఖర్చు, టోల్ రూపంలో వస్తున్న ఆదాయానికి ఏ మాత్రం పొంతన లేదంటూ అంకెలతో సహా ఆధారాలను బయటపెట్టి రీ ట్వీట్ చేసింది.
ఉద్దేశాలు ఏమైనా రష్మిక మందన్నకు సపోర్ట్ గా బిజెపి అనునయులు, ఆమె చేసింది సరికాదని చెప్పేందుకు ఇతర పార్టీల అనుచరులు రెండుగా విడిపోయి డిబేట్లు పెట్టేసుకున్నారు. అయినా సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేసినా ఇలా వేలెత్తి చూపడం ఎంత వరకు సబబని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవల్లికి ఆగస్ట్ లో రిలీజయ్యే పుష్ప 2 ది రూల్ కీలకం కానుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగాన్ని మించి ఇందులో ఎక్కువ లెన్త్ ఇచ్చాడని, పెర్ఫార్మన్స్ కి భారీ స్కోప్ ఉంటుందని ఆల్రెడీ యూనిట్ నుంచి లీక్స్ వస్తున్నాయి. చూడాలి మరి.