నిజమా.. కీర్తిని తప్పిస్తారా?

‘మహానటి’తో తిరుగులేని పేరు సంపాదించిన కీర్తి సురేష్‌ను తమ సినిమాల్లో పెట్టుకోవాలని కోరుకునే ఫిలిం మేకర్స్ చాలామందే ఉన్నారు. పరశురామ్ సైతం మహేష్ బాబుతో తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’కు కీర్తినే కథానాయికగా అనుకున్నాడు.

ఈ విషయమై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. తాను ఈ సినిమాలో నటించబోతున్నట్లు కీర్తినే సంకేతాలిచ్చింది. ఐతే సినిమాను ప్రకటించి మూడున్నర నెలలు దాటినా ఇప్పటిదాకా కథానాయికగా గురించి ఏ అప్ డేట్ లేదు. నిజంగా కీర్తి ఖరారైతే ఈపాటికే ప్రకటించి ఉండాలి.

ఐతే మహేష్ పక్కన కీర్తిని కథానాయికగా పెట్టడంపై అభిమానుల్లో ఏమంత ఉత్సాహం కనిపించలేదు. ‘మహానటి’ తర్వాత కీర్తి నటించిన ఏ సినిమా కూడా ఆడలేదు. ఓటీటీ రిలీజ్ ‘పెంగ్విన్’ సైతం తుస్సుమంది. పైగా కీర్తి సురేష్ లుక్స్ ఈ మధ్య బాగా దెబ్బ తినేశాయి.

ఇంతకుముందు బొద్దుగా ఉన్నపుడే కీర్తి చాలా బాగుంది. స్టార్ హీరోయిన్లు మరీ అంత బొద్దుగా ఉంటే బాగోదనుకుందో ఏమో.. బరువు తగ్గే ప్రయత్నం చేసింది కీర్తి. కానీ ఎఫర్ట్స్ మరీ ఎక్కువ పెట్టడంతో ఒంట్లో కండంతా పోయి ఎముకలు తేలే పరిస్థితి వచ్చింది.

ముఖంలో పూర్తిగా గ్లో పోయింది. బక్క చిక్కిన కీర్తిని గుర్తుపట్టడం కష్టమయ్యే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో మహేష్ పక్కన ఆమె బాగోదన్న కామెంట్లూ పెరిగిపోయాయి. ఎవరైనా గ్లామర్ హీరోయిన్ని పెడితేనే బాగుంటుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల పెట్టేశారు. ఈ ఫీడ్ బ్యాక్‌ను చూసే ఏమో పరశురామ్ ఆలోచన మారినట్లు చెబుతున్నారు.

కీర్తి స్థానంలో వేరొకరిని తేవడంపై అతను సీరియస్‌గానే ఆలోచిస్తున్నాడట. ఇదే నిజమైతే కీర్తికి పెద్ద షాక్ అనే అనుకోవాలి. ‘మహానటి’ తర్వాత ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం కావడం, అవసరానికి మించి బరువు తగ్గి గ్లో కోల్పోవడం కీర్తి కెరీర్‌ను దెబ్బ కొట్టేలాగే కనిపిస్తోంది.