తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే కొద్దీ అహంకారం పెరిగిపోతుంది. సందర్భం వచ్చినా తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకుల గురించి మాట్లాడరు. అలాగే సాయం అవసరమైనపుడు చేయి అందించే వాళ్లు కూడా తక్కువమందే. కానీ ప్రభాస్ అలా కాదు. ఇప్పుడు ఇండియాలోనే అతి పెద్ద స్టార్‌గా ఎదిగినా సరే.. తన మూలాలను అతను ఎప్పుడూ మరిచిపోలేదు. 

కెరీర్ ఆరంభంలో శోభన్ అనే దర్శకుడు ‘వర్షం’ సినిమాతో తనకు పెద్ద హిట్ ఇచ్చాడని.. అతడి కొడుకు సంతోష్ హీరో అయిన దగ్గర్నుంచి తనకు మద్దతుగా నిలుస్తున్నాడు. తన హోం బేనర్ అనదగ్గ యువి బేనర్లో అతడితో వరుసగా సినిమాలు చేయిస్తున్నాడు. సంతోష్‌కు సైతం అది హోం బేనర్‌లా మారిపోయింది. తన కొత్త చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్ కోసం ఒక ఇంటర్వ్యూ కూడా చేశాడు. తన సినిమాలనే ప్రమోట్ చేసుకోని ప్రభాస్.. ఇలా సంతోష్ సినిమాను ప్రమోట్ చేయడం ఆశ్చర్యమే. 

ఇక ఈ ఇంటర్వ్యూలో తాను సూపర్ స్టార్ కావడానికి ముందు పని చేసిన దర్శకుల గురించి కూడా గొప్పగా మాట్లాడాడు ప్రభాస్. తనతో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేసిన పూరి జగన్నాథ్‌ను ప్రభాస్ ఆకాశానికెత్తేశాడు. ఆయన డైలాగుల గురించి, అందులో ఫిలాసఫీ గురించి మాట్లాడుతూ.. పూరిలా ఎవ్వరూ డైలాగులు రాయలేరని తేల్చేశాడు ప్రభాస్. బుజ్జిగాడు సినిమా తనకెంత స్పెషలో కూడా వెల్లడించాడు. 

మరోవైపు తనతో ‘మిర్చి’ తీసిన కొరటాల శివను కూడా కొనియాడాడు ప్రభాస్. అందులో ‘వీలైతే ప్రేమిద్దాం డూడ్. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అనే డైలాగ్ తాలూకు ఫిలాసఫీ గురించి ప్రస్తావించాడు. కొరటాల శివ చాలా పెద్ద విషయాన్ని చిన్న డైలాగుతో ఎంతో బాగా చెప్పారని.. ఆయన డైలాగులూ తనకిష్టమని చెప్పాడు ప్రభాస్. తన స్థాయి ఎంత పెరిగినా సరే.. తన దర్శకుల గురించి ఇలా మాట్లాడ్డం, వారికి ఎలివేషన్ ఇవ్వడం.. కృతజ్ఞత చూపించడం ప్రభాస్‌కే చెల్లు.