దేవర హుకుమ్ – అనిరుధ్ సలామ్

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న దేవర ఆడియోలోని మొదటి లిరికల్ సాంగ్ ఈ వారమే విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 ఒక రోజు ముందుగా ఫ్యాన్స్ కి కానుకగా ఇస్తున్నారు. ఈ సందర్భంగా వదిలిన ప్రీ లుక్ పోస్టర్ లో భయం బ్యాక్ డ్రాప్ లో సాగే శక్తివంతమైన పాటగా దీనికి సంబంధించిన కీలకమైన క్లూ ఇచ్చారు. పంపిణి హక్కులు తీసుకున్నట్టు ప్రచారంలో ఉన్న సితార నాగవంశీ నిన్న పోస్ట్ చేసిన ట్వీట్ లో ఈ సాంగ్ రజనీకాంత్ జైలర్ లో హుకుమ్ ని తలపించేలా ఉంటుందని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దాన్ని మర్చిపోతారని ఓ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడు.

మాములుగానే విపరీతంగా ఉన్న అంచనాలని ఈ ఒక్క మాట రెట్టింపు చేసింది. ఎందుకంటే జైలర్ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది సంగీతం. అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలు యావరేజ్ నెరేషన్ ని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెట్టించాయి. వాటిలో హుకుమ్ ట్రాక్ కీలకమైంది. ఇప్పుడు దాన్ని మించిపోయేలా దేవరకు అవుట్ ఫుట్ ఇచ్చాడంటే మ్యూజిక్ లవర్స్ విపరీతంగా ఎదురు చూడటం సహజం. అనిరుధ్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేసి నాలుగున్నర సంవత్సరాలు దాటేసింది. ఇప్పుడు దేవరతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఒకరకంగా చెప్పాలంటే తమిళంలోనే బెస్ట్ ఇస్తాడని కామెంట్లకు బదులు చెప్పాలంటే దేవరకు అదిరిపోయే అవుట్ ఫుట్ ఇవ్వడం కీలకం. అజ్ఞాతవాసి ఫలితం సంగతి పక్కనపెడితే రెండు పాటలు మినహాయించి మిగిలిన వాటితో నిరాశపరిచాడు. గ్యాంగ్ లీడర్, జెర్సీలో సైతం అన్ని పాటలు ఛార్ట్ బస్టర్ కాలేదు. సో దేవర పట్ల తనకు చాలా బాధ్యత ఉంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని తారక్ చేస్తున్న మూవీ ఇది. దేశ విదేశాల్లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 10 విడుదలకు అనుగుణంగా ప్రమోషనల్ కంటెంట్ ప్లాన్ చేస్తున్నారు.