90 రోజుల పరుగు పందెంలో పుష్పరాజ్

పుష్ప 2 ది రైజ్ విడుదలకు సరిగ్గా మూడు నెలలు మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఆగస్ట్ 15 నుంచి ఎలాంటి వాయిదా ఉండదని మైత్రి మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తుండటంతో ఆ డేట్ ని మిగిలిన నిర్మాతలు పట్టించుకోవడం మానేశారు. దాంతో పోటీ పడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కనక క్లాష్ అయ్యే ఆలోచనలో ఎవరూ లేరు.

అజయ్ దేవగన్ సింగం అగైన్ సైతం పుష్ప క్రేజ్ చూసి మెల్లగా పోటీ నుంచి తప్పుకుంది. ఇక ఇప్పటి నుంచి పుష్పకు ప్రతి రోజు పరుగు పందెంలా ఉండబోతోంది. ఇంకా షూటింగ్ అయిపోలేదు. ఐటెం సాంగ్ తో పాటు ఇంకో పాట బ్యాలన్స్ ఉందని యూనిట్ టాక్.

సుకుమార్ ఆఘమేఘాల మీద ఎన్నో పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్ప 1 ది రైజ్ టైంలోనూ చాలా ఒత్తిడిని ఎదురుకుని చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఆశించిన స్థాయిలో బీజీఎమ్ అవుట్ ఫుట్ రాలేదనే కామెంట్స్ బలంగా వినిపించాయి.

ఇది మళ్ళీ రిపీట్ కాకూడదంటే జూలై మూడో వారం లోపే ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలి. ఫహద్ ఫాసిల్ కు సంబంధించిన కొంత కీలకమైన టాకీ పార్ట్ ఇంకా తీయాల్సి ఉంది. అయితే డేట్ల సమస్య వల్ల ఇది ఆలస్యం కావడం సుకుమార్ ని అసహనానికి గురి చేస్తోందని అంతర్గత సమాచారం.

ఎంత ప్రెజర్ ఉన్నా ఖచ్చితంగా రిలీజ్ టార్గెట్ మిస్ కాకూడదనే సంకల్పంతో టీమ్ వర్క్ చేస్తోంది. అల్లు అర్జున్ సైతం పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఇంకో వైపు షూటింగ్ జరిగిన భాగానికి నిర్మాణాంతర కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. మైత్రి నిర్మాతలు బిజినెస్ డీల్స్ ఇంకా ఫైనల్ చేయడం లేదట.

ట్రైలర్ ని జూన్ చివరి వారంలో లాంచ్ చేశాక అన్ని అగ్రిమెంట్లు పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ లో డిమాండ్ క్రేజీగా ఉండటంతో రేట్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి. అంచనాల్లో తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ అంతకంతా హైప్ పెంచుతూ పోతున్నాడు.