బన్నీ గురించి ఆగని చర్చలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద సోషల్ మీడియా వేదికగా డిబేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎన్నికల ప్రచారం చివరి రోజు నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

రద్దీని నియంత్రించలేని కారణంగా కొందరు పోలీసుల మీద డిపార్ట్ మెంట్ చర్యలు తీసుకోవడమే కాక బన్నీ మీద కేసులు కూడా నమోదయ్యాయి. సరే ఇదేమీ అంత తీవ్రమైన నేరం కాదు కానీ ఒకపక్క పిఠాపురంకు రామ్ చరణ్ వెళ్లిన రోజే అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పెట్టుకోవడం రాజకీయంగానూ దుమారం రేపింది. హైదరాబాద్ లో బన్నీ క్లారిటీ ఇచ్చాడు కూడా.

అయినా సరే ఇక్కడితో ఈ చర్చ ఆగలేదు. మొన్న ఎవరినో ఉద్దేశించి నాగబాబు పెట్టిన ఒక ట్వీట్ ఏకంగా టీవీ డిస్కషన్లకు తెరతీసింది. ఆయన అన్నది అల్లు అర్జున్ నేనని ఫ్యాన్స్ ఎవరికి వారు నిర్వచనాలు ఇచ్చుకోవడంతో వ్యవహారం కొత్త మలుపులు తిరిగింది.

ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శిల్పా రవీంద్ర సైతం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని కామెంట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీంతో ఈ టాపిక్ గురించి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు విశ్లేషణలు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని బన్నీ స్పష్టం చేశాక కూడా ఇవి ఆగడం లేదు.

ఒకవేళ అల్లు అర్జున్ ప్రచారం తొలిదశలోనే ఇలా చేసి ఉంటే వేరేలా ఉండేదేమో కానీ ఎలక్షన్ క్యాంపైన్ చివరి రోజు వెళ్లడం ఇంత రచ్చకు దారి తీసింది. నాగబాబు సైతం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మళ్ళీ దాని మీద ఎంత రాద్ధాంతం చేస్తారోననే అనుమానం కావొచ్చు.

యాంటీ ఫ్యాన్స్ ఈ వ్యవహారాన్ని తమకు సానుకూలంగా మార్చుకునేందుకు చూస్తున్న వైనం ఎక్స్, ఫేస్ బుక్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో కనిపిస్తోంది. తన ఉద్దేశాన్ని బన్నీ అంత స్పష్టంగా వివరించాక కూడా ఇదంతా జరగడం చూస్తే ఎవరి మనోభావాల్లో ఎలాంటి అర్థాలు ఉన్నాయో అంతు చిక్కడం లేదు.