బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది మూడు నెలలు దాటిపోయింది. కానీ అతడి గురించి చర్చ మాత్రం ఆగట్లేదు. అతడిది ఆత్మహత్యేనా.. అదే నిజమైతే అందుకు పురిగొల్పిన కారణాలేంటి.. అందుకు డిప్రెషనే కారణమా.. అతణ్ని ఎవరైనా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారా.. అన్నదానిపై ఒక స్పష్టత ఎంతకీ రావట్లేదు. సుశాంత్ మృతి విషయంలో రోజుకో కొత్త కోణం, ఆరోపణ బయటికి వస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్ వినిపిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశను ఎవరో హత్య చేశారని.. దానికి సుశాంత్ మృతికి కూడా సంబంధం ఉందని.. ఇందుకు సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆయన అన్నారు. కాగా తాజాగా సుశాంత్ మిత్రుడు సిద్దార్థ్ పితానీ అతడి మృతికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు.
సిద్దార్థ్‌ను సీబీఐ అధికారులు సైతం విచారిస్తున్న నేపథ్యంలో అతను మీడియాకు ఇచ్చిన కొన్ని లీక్స్ సంచలనం రేపుతున్నాయి. సుశాంత్ మృతి చెందడానికి కొన్నిరోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్యకు చనిపోగా.. ఈ నేపథ్యంలో సుశాంత్ ఎంతో భయాందోళనలకు గురయ్యాడని సిద్దార్థ్ చెప్పాడు. ‘నన్ను చంపేస్తారు’ అంటూ సుశాంత్ తరచూ తనతో అనేవాడని.. చాలా కంగారుపడేవాడని సిద్దార్థ్ వెల్లడించాడు. తన సెక్యూరిటీని కూడా పెంచుకోవాలనుకున్నాడని సిద్దార్థ్ తెలిపాడు. ఈ విషయాలను సిద్దార్థ్ సీబీఐ ఎదుట చెప్పినట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అలాగే సుశాంత్ మృతి విషయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా గురించి సిద్దార్థ్ పలు కీలక విషయాలను విచారణలో వెల్లడించాడట. సుశాంత్ ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌ను రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని సిద్దార్థ్ సీబీఐకి వెల్లడించినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates