టాలీవుడ్ బాక్సాఫీస్‌లో పరిస్థితులు రోజు రోజుకూ దుర్భరంగా మారుతున్నాయి. ఈసారి వేసవిలో పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద మైనస్ కాగా.. అందుబాటులో ఉన్న చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చూసేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. కొన్ని వారాల నుంచి సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి.కానీ జనం పట్టించుకోవడం లేదు. ‘టిల్లు స్క్వేర్’ మినహా ఏ చిత్రం కూడా మంచి ఫలితాలను అందుకోలేకపోయింది ఈ వేసవిలో. కొన్ని చిత్రాలకు మంచి టాక్ ఉన్నా సరే.. కలెక్షన్లు రాని పరిస్థితి.
గత వారం సుహాస్ మూవీ ‘ప్రసన్న వదనం’కు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. అయినా సరే.. థియేటర్లకు జనం రాలేదు. ఓవైపు ఐపీఎల్, ఇంకోవైపు ఎన్నికల హడావుడిలో మునిగిపోయిన జనాలు థియేటర్లకు రావడం లేదు.
ఈ వారం నాలుగైదు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. అందులో ప్రేక్షకుల దృష్టిని కొంత ఆకర్షించింది కృష్ణమ్మ, ప్రతినిధి-2 చిత్రాలే. వీటిలో ‘ప్రతినిధి-2’కు సరైన టాక్ రాలేదు. జనాలు ముందే దీన్ని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఇక ‘కృష్ణమ్మ’ విషయానికి వస్తే ఇది పర్ఫెక్ట్ మూవీ కాదు కానీ.. మంచి ప్రయత్నమే. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసు చుట్టూ ఒక కల్పిత కథను అల్లుకుని ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా సినిమా తీశాడు కొత్త దర్శకుడు గోపాలకృష్ణ.
ఈ సినిమాకు ఎబోవ్ యావరేజ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. కానీ టాక్‌లో ఉన్న పాజిటివిటీ కలెక్షన్లలో ప్రతిఫలించడం లేదు. తొలి రోజు చాలా వరకు థియేటర్లు ఖాళీగానే కనిపించాయి. రెండో రోజు సినిమా కొంచెం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. కానీ ఎన్నికల హడావుడి పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో సోమవారం వరకు జనాలు థియేటర్లకు కదలడం కష్టమే. కానీ కీలకమైన వీకెండ్లో వసూళ్లు లేకుంటే సినిమా అన్యాయం అయిపోయినట్లే.