చరణ్ బన్నీ వేర్వేరు దారులు తాత్కాలికమే

సినిమాలకు సంబంధం లేకుండా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ ఒకేసారి వేర్వేరు కారణాల వల్ల ట్రెండింగ్ లోకి రావడం అరుదు. పిఠాపురంకు తల్లి సురేఖ, మావయ్య అల్లు అరవింద్ తో బయలుదేరిన చరణ్ కు రాజమండ్రిలో ఘనస్వాగతం లభించింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జనసేన తరఫున వెళ్తున్నట్టు చరణ్ టీమ్ ఎక్కడా చెప్పలేదు కానీ ప్రచారానికి చివరి రోజైన ఆదివారమే దీనికి ఎంచుకోవడం ఎందుకో స్పష్టంగా చెప్పొచ్చు. పైగా జగన్ పిఠాపురం వస్తున్న రోజే చరణ్ ట్రిప్ ప్లాన్ చేయడం వల్ల సోషల్ మీడియా అటెన్షన్ ని మెగా వైపు తిప్పడమనే స్ట్రాటజీని తేలిగ్గా తీసుకోలేం.

ఇక అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి అధికార పార్టీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సంఘీభావం తెలిపాడు . ఊహించని స్థాయిలో పట్టణం రద్దీతో ఊగిపోయిన ఫోటోలు వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అలా అని బన్నీ పూర్తిగా వైసిపికి మద్దతు ఇస్తున్నట్టు కాదు. నిన్నే పవన్ కళ్యాణ్ కు విషెస్ చెబుతూ ట్వీట్ చేయడం చూశాం. నాన్న, పెదమావయ్య, తమ్ముడు ఇలా అందరూ ఒకవైపు తాను ఇంకో స్టాండ్ తీసుకోవడం ఉండదు. శిల్పా గెలుపుకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశమే అయినప్పటికీ అల్లు అర్జున్ ఇలా ఓపెన్ గా వైఎస్ఆర్సిపి అభ్యర్థికి సపోర్ట్ చేయడం మీద రకరకాల కామెంట్లు మొదలయ్యాయి.

చరణ్ బన్నీల ఉద్దేశాలు ఏమైనా వీటి ప్రయోజనాలు మాత్రం తాత్కాలికమే. ఒక్కసారి ఫలితాలు వెల్లడయ్యాక ఎవరి ప్రపంచంలో వాళ్ళు బిజీ అయిపోతారు. జనసేన కోసం రామ్ చరణ్ రెగ్యులర్ గా తిరగడమూ ఉండదు. శిల్పా కోసం బన్నీ తరచుగా నంద్యాల వెళ్ళడమూ సాధ్యపడదు. కేవలం బంధుత్వాల కోసం ఇచ్చిన చేయూతగానే చూడాలి. వెంకటేష్ సైతం ఈ సూత్రాన్నే పాటించాడు. నియోజకవర్గాల వారిగా ఫలితాలు వచ్చాక ఎవరి ప్రభావం ఎంత ఉందో ఒక అంచనాకు రావొచ్చు. చరణ్ జనసేన సపోర్ట్ స్పష్టమే కానీ అల్లు అర్జున్, వెంకటేష్ విషయంలో చూడాల్సింది రాజకీయం కాదు బంధుప్రీతే.