ఎన్నాళ్లో ఎదురు చూస్తున్న రిలీజ్ డేట్ ఇదిగో..

థియేట‌ర్లు మూత ప‌డ్డ ఈ ఆరు నెల‌ల్లో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు నేరుగా ఓటీటీల్లో రిలీజ‌య్యాయి. ఐతే వాటిలో ఊర మాస్ సినిమా ఒక్క‌టంటే ఒక్క‌టీ లేదు. ఆ లోటును అక్ష‌య్ కుమార్ సినిమా ల‌క్ష్మీబాంబ్ తీరుస్తుంద‌న్న ఆశ‌తో ఉన్నారు ఆ వ‌ర్గం ప్రేక్ష‌కులు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన అతి పెద్ద సినిమా కూడా ఇదే కావ‌చ్చు.

ఖాన్ త్ర‌యం త‌ర్వాత బాలీవుడ్లో అతి పెద్ద హీరో అయిన అక్ష‌య్ కుమార్ న‌టించిన సినిమా కావడం, పైగా సౌత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కాంఛ‌న‌కు రీమేక్ కావ‌డంతో ల‌క్ష్మీబాంబ్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కులు సొంతం చేసుకున్న హాట్ స్టార్ సంస్థ రిలీజ్ డేట్ విష‌యంలో ఊరిస్తూ వ‌చ్చింది.

ఐతే ఎట్ట‌కేల‌కు ల‌క్ష్మీబాంబ్ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. దీపావ‌ళి కానుక‌గానే ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. కాక‌పోతే పండ‌క్కి ఆరు రోజుల ముందే సినిమా ఆన్ లైన్లోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌రు 14న దీపావ‌ళి కాగా.. 9వ తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ఒక ఆస‌క్తిక‌ర ప్రోమో ద్వారా హాట్ స్టార్ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ అనౌన్స్‌మెంట్ రావ‌డం ఆల‌స్యం సోష‌ల్ మీడియాలో ల‌క్ష్మీబాంబ్ హ్యాష్ ట్యాగ్ మోతెక్కిపోయింది. ట్విట్ట‌ర్లో ఇదే హాట్ టాపిక్ అయింది.

థియేట‌ర్లు మూత ప‌డ్డ కొత్త‌లో ల‌క్ష్మీబాంబ్ డిజిట‌ల్ రిలీజ్ గురించి వార్తలొస్తే తేలిగ్గా తీసుకున్నారంతా. ఇంత పెద్ద సినిమా ఓటీటీల్లో నేరుగా రిలీజ్ కావ‌డ‌మేంటి అని. కానీ త‌ర్వాత మారిన ప‌రిస్థితుల్లో ఆ వార్తే నిజ‌మైంది. దీంతో పాటుగా అర‌డ‌జ‌ను భారీ చిత్రాల్ని హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకుని వ‌రుస‌గా ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రిలీజ్ చేస్తూ వ‌స్తోంది.