ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు కానీ తమన్నా, రాశిఖన్నాలు ప్రధాన పాత్ర పోషించడం వల్ల మాస్ లో దీని మీద అంతో ఇంతో ఆసక్తి కలిగింది. దర్శకుడు సుందర్ సి టీమ్ తో సహా హైదరాబాద్ వచ్చి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాడు. అయినా సరే అడ్వాన్స్ బుకింగ్స్ చప్పగా ఉన్నాయి. పోనీ కరెంట్ సేల్స్ బాగుంటాయా అంటే అది పూర్తిగా టాక్ మీద ఆధారపడి ఉంది. హారర్ జానర్ కావడంతో సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉంటారు. కాచుకోవాల్సింది దెయ్యాల ప్రేమికులే.
ఇంత తక్కువ బజ్ ఉండటానికి కారణం సుందరే. నటుడిగా మనకు ఏ మాత్రం పరిచయం లేని ఇతనే హీరోగా నటించడం ఒక కారణమైతే ఈ సిరీస్ లో మొదటి చిత్రం చంద్రకళ తప్ప మిగిలినవి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం వర్కౌట్ కాకపోవడం. కళావతిలో ఇంతకన్నా పెద్ద క్యాస్టింగ్ తో భారీగా తీసినా ఫలితం దక్కలేదు. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ లో మాత్రమే చూశారు. ఇప్పుడు బాక్ పరిస్థితి ఇలా ఉంది. అసలు టైటిల్ అంత విచిత్రంగా ఉంటే పబ్లిక్ కు ఆసక్తి ఎక్కడి నుంచి వస్తుంది. ఒరిజినల్ వెర్షన్ బజ్ మాత్రం చెప్పుకోదగ్గట్టుగా ఉంది కానీ ఇక్కడే తేడా.
అసలే మరో నాలుగు సినిమాలతో పోటీ పడుతున్న బాక్ అరణ్మయి 4 తర్వాత అయిదో భాగం కూడా తీస్తారట. ఏదో అవెంజర్స్ రేంజ్ లో దీన్ని పొడిగించుకోవడం ఒకరకంగా షాకే. ట్రైలర్ సైతం అంచనాలు పెంచలేకపోయింది. తమన్నా, రాశిఖన్నాలు ఎంత దెయ్యం బ్యాక్ డ్రాప్ అయినా సరే ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి గ్లామర్ టచ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ తర్వాత వచ్చే పాట కోసం అందాలు ఆరబోశారు. ప్రసన్నవదనం, ఆ ఒక్కటి అడక్కు, శబరీలతో పోటీ పడుతున్న బాక్ గుండెల్లో గుచ్చుకుంటుందో లేక లారెన్స్ హారర్ కామెడీ లాగా నవ్వించి భయపెట్టి కమర్షియల్ గా గట్టెక్కుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates