మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది. మెగా హీరోల సినిమాల వేడుకల్లో పవన్ కళ్యాణ్ కోసం నినాదాలు చేసే అభిమానులతో బన్నీ ‘సరైనోడు’కు సంబంధించిన ఈవెంట్లో కయ్యం పెట్టుకున్న సంగతి తెలిసిందే. పవన్ గురించి చెప్పమని ఫ్యాన్స్ అరిస్తే.. చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన వ్యాఖ్య అప్పట్లో సంచలనం రేపింది.
ఆ తర్వాత కూడా బన్నీ వ్యవహార శైలి పవన్ ఫ్యాన్స్‌కు నచ్చక అతడి పట్ల అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోయింది. ‘మెగా’ బ్రాండుతో హీరోగా ఎదిగి.. ఆ తర్వాత సొంత ఇమేజ్ కోసం అతను తహతహలాడుతున్నాడంటూ తన మీద మెగా అభిమానుల్లో ఒక వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ విషయమై నెగెటివ్ క్యాంపైనింగ్ కూడా నడుస్తుంటుంది.
ఐతే పవన్ కోసం అవసరమైనపుడు బన్నీ ముందుకు వచ్చి మద్దతు ప్రకటించిన విషయాలను ఫ్యాన్స్ మరిచిపోతుంటారు. అప్పట్లో తన తల్లిని దూషించిన విషయమై పవన్ నిరసనకు దిగితే బన్నీ వచ్చి అండగా నిలిచాడు. అంతే కాక ఒకసారి ఎన్నికల ప్రచారంలో ఉన్న పవన్‌కు కూడా బాసటగా నిలిచాడు. ఇక వర్తమానంలోకి వస్తే.. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును బన్నీ ప్రమోట్ చేయడం విశేషం.
భారీ హైప్ మధ్య రిలీజ్ కానున్న బన్నీ కొత్త చిత్రం ‘పుష్ప-2’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. అందులో చివర్లో బన్నీ గాజు గ్లాసులో టీ పెట్టుకుని స్టెప్ వేయడం.. అందులో బిస్కెట్ ముంచి తినడం గమనించవచ్చు. ఇది యథాలాపంగా పెట్టిన షాట్ కాదని.. పవన్‌కు, జనసేనకు తన మద్దతు ఉందని బన్నీ చెప్పకనే చెప్పాడని.. గాజు గ్లాసును భలేగా ప్రమోట్ చేశాడని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో పవన్ కోసం చిరంజీవి సహా పలువురు మెగా హీరోలు పూర్తి మద్దతుగా నిలుస్తుండగా.. బన్నీ కూడా వారికి తోడవడం మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates