పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు భాగాలుగా వస్తోంది. ఇవాళ విడుదల చేసిన టీజర్ లో రెండు విషయాలు స్పష్టం చేశారు. మొదటిది దర్శకత్వ బాధ్యతని క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ పూర్తి చేయబోతున్నాడు. మరొకటి ఇది రెండు భాగాల పీరియాడిక్ డ్రామా. ఫస్ట్ పార్ట్ కి స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ని ఉప శీర్షికగా పెట్టారు. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫైనల్ గా చెక్ పడినట్టు అయ్యింది. ఇంకో కీలకమైన అప్ డేట్ ఏంటంటే మొదటి భాగం ఈ 2024లోనే విడుదలవుతుందని చెప్పేశారు.
నిడివి తక్కువగా పెట్టి పవన్ పాత్ర పరిచయానికి ఈ కొత్త టీజర్ ని ఉపయోగించారు. దశాబ్దాల క్రితం భారతదేశం పరాయి పాలనలో మొగ్గుతున్నప్పుడు ఎన్నో ప్రాంతాలు దొరలు, మొగలాయి రాజుల దోపిడీ రాజ్యంలో నలిగిపోయేవారు. వారిని దోచుకుని పేదలకు పంచి పెట్టే యోధుడు వీరమల్లు(పవన్ కళ్యాణ్). నవాబ్(బాబీ డియోల్) దుర్మార్గాలకు అడ్డుగా నిలిచి ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడతాడు. గొప్ప పోరాట యోధుడైన వీరమల్లు కత్తిసాముతో సహా యుద్ధ విద్యల్లో ఆరితేరి ఉంటాడు. అతని లక్ష్యం, ప్రయాణం రెండూ ఎటు వైపో సినిమాలో చూపించబోతున్నారు.
అంచనాలకు తగ్గట్టే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. ఆస్కార్ విజేత కీరవాణి నేపధ్య సంగీతం బాగా ఎలివేట్ అయ్యింది. కేవలం ఇంట్రో టీజర్ కాబట్టి ఎక్కువ కంటెంట్ ని చూపించకుండా జాగ్రత్త పడ్డారు. పవన్ కళ్యాణ్ లుక్, ఖుషిని గుర్తు చేసేలా చేసిన కత్తి సాము అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. దర్శకుడు క్రిష్ మరోసారి తన పనితనాన్ని చూపించారు. విపరీతమైన జాప్యం వల్ల ఇప్పటికే హైప్ తగ్గిపోయిన హరిహర వీరమల్లుకి బజ్ పెరిగేలా ఇదెంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. వీడియో చివర్లో 2024 రిలీజ్ అని చెప్పేశారు కాబట్టి ముఖ్యమైన సస్పెన్స్ తీరినట్టే.