మరో బాహుబలి.. ట్రెండ్ సెట్ చేస్తుందా

కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా చేసిన బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్యాన్ ఇండియా పదం విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా దాని వల్లే. రెండు భాగాలతో రాజమౌళి చేసిన విజువల్ మాయాజాలం ఎప్పుడు చూసినా కట్టిపడేస్తుంది. ఇలాంటి మాస్టర్ పీస్ కి కొనసాగింపు లేదా పూర్వం శివగామి జీవితంలో ఏం జరిగిందనే దాని మీద ప్రీక్వెల్ లాంటివి రావాలని అభిమానులు కోరుకున్నారు. కొన్నేళ్ల క్రితం నెట్ ఫ్లిక్స్ ఆ ప్రయత్నం చేసింది కానీ అవుట్ ఫుట్ సరిగా రాక ఆపేసింది.

తాజాగా బాహుబలి క్రౌన్ అఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రానుంది. దీన్ని స్వయంగా రాజమౌళినే పర్యవేక్షిస్తున్నారు. త్వరలో ట్రైలర్ విడుదల కాబోతున్న విషయాన్ని నిన్న అధికారికంగా ప్రకటించారు. అంటే పాత్రలు ప్రభాస్, రమ్యకృష్ణ, రానా, అనుష్కలను పోలి ఉంటాయన్న మాట. దీనికి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకవేళ ఈ ప్లాన్ కనక వర్కౌట్ అయితే పుష్ప, కాంతార, కెజిఎఫ్, విశ్వంభర లాంటి ఇతర సినిమాలు ఇదే తరహాలో గ్రాఫిక్ సిరీస్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. డిస్నీ హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమింగ్ కావొచ్చని సమాచారం.

ఈ ట్రెండ్ ముందే గుర్తించిన మంచు విష్ణు తన కన్నప్పను ప్రింటెడ్ యానిమేషన్ రూపంలో పుస్తకాలు సిద్ధం చేయించాడు. సోషల్ మీడియా వేదికగా ఎంపిక చేసిన ఫాలోయర్స్ కి మొదటి భాగాన్ని ఉచితంగా పంచి పెట్టాడు. కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టిన సినిమాల ప్రమోషన్ల విషయంలో క్రియేటివ్ గా ఉంటేనే ఆడియన్స్ ని ఆకర్షించగలిగే పరిస్థితుల్లో ఇలాంటి కొత్త పోకడలు ఆహ్వానించదగ్గవే. ఆనంద్ నీలకంఠ రాసిన శివగామి పుస్తకమే అంత సెన్సేషన్ సృష్టించినప్పుడు ఇప్పుడు రాబోయే విజువల్ ట్రీట్ క్రౌన్ అఫ్ బ్లడ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ నెలలోనే స్ట్రీమింగ్ ఉండొచ్చు.