క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్ కోసం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి మాములుగా కష్టపడటం లేదు. మొదటి భాగానికి హోంబాలే ఫిలింస్ కేవలం ఇరవై కోట్ల లోపే ఖర్చు పెడితే ఇప్పుడీ కొనసాగింపు కోసం ఏకంగా అయిదింతలు ఎక్కువ బడ్జెట్ పెంచేయడం కంటెంట్ మీద నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం 200 * 200 అడుగుల వైశాల్యంతో కుందాపుర ప్రపంచాన్ని సెట్ రూపంలో పునఃసృష్టి చేసే పనిలో ఉన్నారు. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నారు.
హైదరాబాద్, బెంగళూరు, ముంబై నుంచి పిలిపించిన 600 కార్పెంటర్లు అహోరాత్రాలు దీని మీదే వర్క్ చేస్తున్నారు. ఒకపక్క ఈ సెట్ల నిర్మాణం జరుగుతుండగానే క్యాస్టింగ్ మొత్తానికి భారీ ఎత్తున వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, భాష తదితర అంశాల మీద కఠినమైన శిక్షణ కొనసాగుతోంది. ఏదో రెగ్యులర్ ట్రైనింగని భావించిన యాక్టర్స్ కి లోపల జరుగుతున్న తతంగం ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగిస్తోంది. రాజీ ప్రసక్తే లేకుండా రిషబ్ శెట్టి కాంతార 2 సిద్ధం చేయబోతున్నారు. ఇది కాంతారకు ముందు ఏం జరిగిందనే పాయింట్ తో రూపొందుతోంది.
2025 సంక్రాంతికి విడుదల చేసే సాధ్యాసాధ్యాల గురించి టీమ్ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఒకవేళ సాధ్యం కాకపోతే వేసవి రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటారు. బిజినెస్ పరంగా ఎంత క్రేజీ ఆఫర్స్ వస్తున్నా నిర్మాతలు ఇంకా అడ్వాన్సులు తీసుకోవడం లేదు. టీజర్ వచ్చాక రేట్ల గురించి మాట్లాడబోతున్నారు. ఊహకందని అనిర్వచనీయమైన అనుభూతినిచ్చేలా రిషబ్ శెట్టి చాలా గొప్పగా కాంతార 2కి తెరకెక్కిస్తున్నాడట. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో వాటి కోసం విదేశీ నిపుణులు రాబోతున్నారు. ఈసారి తారాగణంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి.