పుష్ప-2.. మళ్లీ అదే కథా?

‘పుష్ప: ది రైజ్’కు కొనసాగింపుగా ‘పుష్ప: ది రూల్’ను ఇంకో ఏడాదిలోనే రిలీజ్ చేసేస్తారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ టైంకి కనీసం స్క్రిప్టు కూడా పూర్తిగా రెడీ కాలేదు. ఇప్పుడు తొలి భాగం వచ్చిన రెండున్నరేళ్లకు పైగా గ్యాప్ తర్వాత రెండో భాగం రాబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ముందు ఈ డేట్ ప్రకటించినపుడు అంత లేటా అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు చూస్తే ఆ డేట్‌కి సినిమా వస్తే చాలు అన్నట్లుంది పరిస్థితి. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కావాల్సిన ఈ చిత్రానికి కనీసం మూడు నెలల ముందే చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాలి. దేశ విదేశాల్లో ఈ చిత్రానికి హైప్ ఉన్న నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునేలా ప్రమోషన్లు కూడా కొంచెం పద్ధతిగా చేయాలి.

కానీ సుకుమార్ సినిమా అంటే రిలీజ్ ముంగిట హడావుడి పడకుండా ఉండడం అసాధ్యం. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌గా పేరున్న సుక్కు.. ఏదీ ఒక పట్టాన తేల్చడు. షూటింగ్ ఆలస్యం కావడం అనివార్యం. అందుకే ముందు అనుకున్న ప్రకారం మే నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి చేయడం కష్టసాధ్యంగా మారుతోందట. డెడ్ లైన్లు పెట్టుకుని రేయింబవళ్లు పని చేస్తున్నా షెడ్యూళ్లలో ఏదో ఒక తేడా వస్తూనే ఉంది.

దీంతో జూన్‌లో కూడా షూట్ కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ రిలీజ్ టైంలో సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాక రిలీజ్ ముందు రోజు వరకు టీం ఎంత కష్టపడిందో, టెన్షన్ అనుభవించిందో తెలిసిందే. ‘పుష్ప-2’కు ఎంత అడ్వాన్స్ ప్లానింగ్ ఉన్నా సరే మళ్లీ  అప్పటి కష్టం, టెన్షన్ తప్పేలా లేదు అన్నది టీం వర్గాల సమాచారం. ఐతే సుకుమార్‌ సంగతి తెలిసిన టీం సభ్యులు ఇది మనకు మామూలే కదా అని అనుకుంటున్నారట. ఏదో ఒకటి చేసి ఆగస్టు 15కు సినిమా రిలీజ్ చేస్తే చాలని అందరూ కష్టపడుతున్నారట.