మే 3 – పంచ సినిమాల యుద్ధం  

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏప్రిల్ నెల తీవ్రంగా నిరాశ పరిచిన నేపథ్యంలో సినీ ప్రేమికులు, బయ్యర్ల ఆశలన్నీ మేకి వచ్చేశాయి. మొదటి వారమే చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కి సిద్ధం కావడంతో ఏవి తమను మెప్పిస్తాయో, నిలబడతాయోనని ఎదురు చూస్తున్నారు. మే 3 దానికి వేదిక కానుంది. అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ మీద క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. పెళ్లి చుట్టూ తిరిగే కామెడీ కాన్సెప్ట్ తో మల్లి అంకం సరదాగా తెరకెక్కించిన వైనం ట్రైలర్ లో కనిపించింది. తన కామెడీ స్కూల్ ని మళ్ళీ తెరిపించే సత్తా దీనికుందని అల్లరోడు నమ్ముతున్నాడు.

సుహాస్ ‘ప్రసన్నవదనం’కు వినూత్న ప్రమోషన్ల ద్వారా హైప్ పెంచుతున్నారు. ఎదుటివారి మొహాలు గుర్తుపట్టలేని విచిత్రమైన జబ్బుని పాయింట్ గా తీసుకుని సుకుమార్ శిష్యుడు అర్జున్ దీన్ని తీశారు. వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్ పోషించిన ‘శబరి’ మీద అంతగా బజ్ లేకపోయినా టీమ్ మాత్రం తమ చిత్రం గురించి టాక్ మాట్లాడుతుందనే ధీమాతో ఉంది. అనిల్ దర్శకత్వం వహించగా సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తోంది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో సుందర్ సి తీసిన ‘బాక్ అరణ్మయి 4’ మాస్ అండ్ హారర్ లవర్స్ ని నమ్ముకుంది. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హడావిడి గట్టిగానే చేశారు.

ఉయ్యాలా జంపాల ఫేమ్ విరించి వర్మ చాలా గ్యాప్ తీసుకుని చేసిన ‘జితేందర్ రెడ్డి’ సైతం టాక్ మీదే ఆధారపడి వస్తోంది. బయోపిక్ కాబట్టి ప్రేక్షకులను ఎంతమేరకు కనెక్ట్ చేసుకుంటారో చూడాలి. పెద్ద స్టార్ హీరోలు ఎవరూ లేకుండా ఇన్నేసి సినిమాలు రావడం ఒకపక్క సంతోషం కలిగిస్తున్నా ఎన్నికలు అతి దగ్గరగా ఉన్న తరుణంలో జనాలు థియేటర్లకు వచ్చేందుకు ఏ మేరకు ఆసక్తి చూపిస్తారనేది వేచి చూడాలి. చాలా బాగుందనే టాక్ వస్తే చాలు మిగిలిన విషయాలేవీ ప్రేక్షకులు పట్టించుకోరు కానీ ఇక్కడ చెప్పిన అయిదు చిత్రాలకు అది తెచ్చుకోవడమే పెద్ద సవాల్. చూద్దాం.