స‌మంత.. వేరే దారి లేకేనా?

ఆదివారం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు పెద్ద స‌ర్ప్రైజే ఇచ్చింది. మా ఇంటి బంగారం పేరుతో త‌న కొత్త సినిమాను ప్ర‌క‌టించింది. ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ పేరుతో ఆమె సొంత నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పి ఆ బేన‌ర్ మీదే ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌డం విశేషం. చేతిలో గ‌న్ను ప‌ట్టుకున్న ఇల్లాలి లుక్‌లో స‌మంత ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది.

కానీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడెవ‌రో.. మిగ‌తా టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టుల సంగ‌తేంటో వెల్ల‌డించ‌లేదు. క‌నీసం ద‌ర్శ‌కుడి పేరైనా స‌మంత ఎందుకు వెల్ల‌డించ‌లేదు అన్న‌ది ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. దీంతో ఈ సినిమా నిజంగా తెర‌కెక్కేదేనా అన్న సందేహాలు కూడా జ‌నాల్లో వ్య‌క్త‌మ‌య్యాయి.
ఈ సంగ‌త‌లా ఉంచితే ఇప్పుడున్న స్థితిలో స‌మంత ప్రొడ‌క్ష‌న్లోకి దిగాల్సిన అవ‌స‌ర‌మేంటి అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఫిలిం ప్రొడ‌క్ష‌న్ రోజు రోజుకూ జూదంలా మారుతూ.. పేరున్న నిర్మాణ సంస్థ‌లు కూడా ఇబ్బంది పడుతున్నాయి. డిజిటల్ హ‌క్కుల మార్కెట్ బాగా దెబ్బ తినేయ‌డంతో చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేసి లాభాలు చూడ‌డం చాలా క‌ష్ట‌మైపోతోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత ఇంకెవ్వ‌రి భాగ‌స్వామ్యం తీసుకోకుండా ఒంట‌రిగా పెద్ద రిస్క్ చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఐతే అనారోగ్యం కార‌ణంగా బ్రేక్ తీసుకుని తిరిగి సినిమాల‌కు సిద్ధ‌మ‌య్యాక స‌మంత‌కు కొత్త ఛాన్సులేవీ రాలేదు. ఈ మ‌ధ్య కొన్ని అల్ట్రా గ్లామ‌ర‌స్ ఫొటో షూట్లు చేసినా స్పంద‌న క‌నిపించ‌లేదు. కొన్ని నెల‌లు వెయిట్ చేసినా కొత్త ఆఫ‌ర్లు రాని నేప‌థ్యంలో త‌నే సొంతంగా సినిమాను ప్రొడ్యూస్ చేసుకోవ‌డానికి స‌మంత రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ రిస్క్ ఆమెకు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.