పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది కూడా. 2004లో వచ్చిన మల్లీశ్వరి ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మూవీ లవర్స్ కి బాగా గుర్తు. ఇరవై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అందులో కామెడీ తాజాగా ఎంటర్ టైన్ చేస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మేజిక్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. పెళ్లి కానీ ప్రసాద్ గా వెంకటేష్ నటన, హుషారైన కోటి పాటలు, సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ వినోదాన్ని జోడించిన తీరు నవ్వులనే కాదు బాక్సాఫీస్ వద్ద సురేష్ సంస్థకు బోలెడు కాసులు కురిపించాయి.
ఇటీవలే దర్శకుడు విజయ్ భాస్కర్ దీని గురించి ఓపెననయ్యారు. అదేంటో చూద్దాం. మల్లీశ్వరి కథ ఓకే అయ్యాక కోట్ల సంపదకు వారసురాలైన మహారాణి లుక్స్ తో ఉండే హీరోయిన్ కోసం తెగ వెతికారు. కానీ సురేష్ బాబుతో సహా అందరూ ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. చివరికి విసుగొచ్చిన టైంలో ఒక యాడ్ లో కత్రినా కైఫ్ ని చూసిన విజయ్ భాస్కర్ ఆమెను రికమండ్ చేశారు. దీంతో ముంబై వెళ్లి ఎంక్వయిరీ చేసి ఎలాగోలా ఒప్పించి హైదరాబాద్ పిలిపించుకుని ఓకే చేశారు. రెమ్యునరేషన్ ఏకంగా 75 లక్షలు డిమాండ్ చేసింది. అప్పటి తెలుగు హీరోయిన్స్ అందులో సగం తీసుకోవడమే గొప్ప.
సరేనని ఒప్పేసుకున్నాక ఆమెతో పాటు స్టాఫ్ ఖర్చులు పాతిక లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలయ్యింది. తీరా చూస్తే కత్రినా కైఫ్ కు ఎక్స్ ప్రెషన్లు సరిగా పలకడం లేదు. డాన్సులు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అయినా సరే కోరి తెచ్చుకున్నాడు కాబట్టి విజయ్ భాస్కర్ నానా తంటాలు పడుతూ ఎలాగోలా ఆమెతో చేయించుకున్నాడు. గాయని సునీత డబ్బింగ్, సాంగ్స్, బీజీఎమ్, క్యాస్టింగ్ ఆవిడ లోపాలను కవర్ చేశాయి. తర్వాత బాలీవుడ్ లో కత్రినా ఎంత మెరుగయ్యిందో చూశాం. ఇప్పుడు మల్లీశ్వరి పెట్టుకుని తదేకంగా కత్రినానే చూస్తే విజయ్ భాస్కర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ట్రై చేయండి.