తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఏపీ రాజకీయాల గురించి చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. తన కొత్త చిత్రం రత్నం ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విశాల్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతాడని అతనన్నాడు.
అంతేకాక గతంలో జగన్ చేసిన పాదయాత్ర విషయంలోనూ ప్రశంసలు కురిపించాడు. తనకు జగన్ అంటే ఇష్టమని ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది తెలుగుదేశం, జనసేన అభిమానులకు నచ్చలేదు. విశాల్ రెడ్డి కాబట్టే జగన్ రెడ్డినే మళ్లీ సీఎం అంటున్నాడని.. ఏపీలో వాస్తవ పరిస్థితులు అతడికి తెలియవని విమర్శించారు.
ఐతే తాజాగా రత్నం సినిమాకు సంబంధించి విలేకరుల సమావేశంలో విశాల్ పొలిటికల్ కామెంట్ల ప్రస్తావన వచ్చింది. దీని గురించి విశాల్‌ను ప్రశ్నిస్తే.. తన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించాడు. తాను తన అభిప్రాయం మాత్రమే చెప్పానని.. వివాదాస్పద వ్యాఖ్యలేమీ చేయలేదని.. ఇందులో కాంట్రవర్శీ చేయడానికి ఏమీ లేదని విశాల్ అన్నాడు. తాను ఐదేళ్ల ముందు కూడా ఎన్నికల టైంలో ఇదే చెప్పానని.. ఇప్పుడూ ఇదే చెప్పానని విశాల్ తెలిపాడు.
తాను ఎవరికీ ఓటు వేయమని కానీ.. ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదని విశాల్ స్పష్టం చేశాడు. తనకు ఏపీలో అసలు ఓటే లేదని.. తనకు ఓటు ఉన్నది తమిళనాడులో అని.. అక్కడ కూడా తాను ఒక పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడనని విశాల్ అన్నాడు. తన వ్యాఖ్యలను వివాదాస్పదంగా చూడొద్దని మీడియాకు అతను విజ్ఞప్తి చేశాడు.