లోకాన్ని రక్షించే యోధుడు ‘మిరాయ్’

Mirai Telugu Glimpse | Teja Sajja | Karthik Gattamneni | TG Vishwa Prasad | People Media Factory

ఈ ఏడాది హనుమాన్ రూపంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ సజ్జ త్వరలో మిరాయ్ గా రాబోతున్నాడు. టైటిల్ కు సంబంధించిన లీక్ గతంలోనే వచ్చినప్పటికీ ఇవాళ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా చేసిన ఈవెంట్ ద్వారా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. క్యాస్టింగ్ కు సంబంధించిన ఇతర వివరాలు చెప్పకపోయినా విడుదల తేదీని ఖరారు చేశారు. వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 18న బహుబాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ చేసుకోబోతోంది. ఈ సందర్భంగా రెండు నిమిషాలకు దగ్గరగా ఉన్న ఆసక్తికరమైన టీజర్ ని వదిలారు. కాన్సెప్ట్ ఏంటో వివరించే ప్రయత్నం చేశారు.

శతాబ్దాల వెనుక అశోక చక్రవర్తికి మచ్చగా మిగిలిపోయిన కళింగ యుద్ధం తర్వాత మానవాళి మనుగడ కోసం ,మనిషిని దేవుడిగా మార్చడం కోసం ఉద్దేశింపబడ్డ తొమ్మిది అద్భుత గ్రంథాలను కాచుకుని వాటిని సరైన వారసులకు అందించేందుకు తొమ్మిది యోధులు కాపలాగా ఉంటారు. అయితే గ్రహణం లాంటి ఒక దుర్మార్గుడు వాటి మీద కన్నేసి ఎంతటికైనా తెగించేందుకు సిద్ధపడతాడు. వీడి నుంచి కాపాడేందుకే పుట్టిన ఒక సూపర్ యోధ ప్రాణాలకు తెగించి రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. ఈ క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలను దాటుకుంటూ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ.

రవితేజ ఈగల్ తో ఫిబ్రవరిలో పలకరించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈసారి చాలా పెద్ద కాన్వాస్ తీసుకున్నాడు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్, అశోకుడి నేపథ్యం ఆసక్తికరంగా ఉన్నాయి. గౌరాహరి సంగీతంతో పాటు ఇతర సాంకేతిక విలువలు ఉన్నతంగా కనిపిస్తున్నాయి. అంచనాలు పెంచేలా ఉన్న వీడియో ద్వారా తేజ సజ్జ మరోసారి సూపర్ హీరోగా కనిపించబోతున్నాడని అర్థమైపోయింది. సరిగ్గా ఏడాది ముందు రిలీజ్ డేట్ లాక్ చేయడం ద్వారా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీని ప్లానింగ్ లో ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంచు మనోజ్ విలననే ప్రచారం ఉంది కానీ టీమ్ కన్ఫర్మ్ చేయలేదు.