రాఘ‌వ లారెన్స్.. ట్రిపుల్ ధమాకా


నృత్య ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లుపెట్టి.. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ చాటుకున్న బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి రాఘ‌వ లారెన్స్. కొన్నేళ్ల నుంచి అత‌ను ద‌ర్శ‌క‌త్వానికి దూరంగా ఉంటూ న‌టుడిగానే సినిమాలు చేస్తున్నాడు. గ‌త ఏడాది లారెన్స్ నుంచి వ‌చ్చిన జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్.. న‌టుడిగా అత‌డి కెరీర్లో బెస్ట్ ఫిలింగా నిలిచింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఓ మోస్త‌రుగా ఆడిన ఈ చిత్రంతో న‌టుడిగా ఒకేసారి చాలా మెట్లు ఎక్కాడు లారెన్స్.

ఈ సినిమా త‌ర్వాత చాలా క‌థ‌లు విన్నా త‌న‌కు అంత కిక్ ఇవ్వ‌లేదంటూ కొత్త సినిమాలే ఒప్పుకోలేదు లారెన్స్. ఐతే ఇప్ప‌డు అత‌ను ఒకేసారి మూడు సినిమాలు ఓకే చేయ‌డం విశేషం. అందులో రెండు హీరోగా న‌టించ‌బోయేవి కాగా.. ఇంకోటి తాను ఎప్ప‌ట్నుంచో భాగం కావాల‌నుకున్న డ్రీమ్ కాంబినేష‌న్లో రాబోతున్న చిత్రం.

లారెన్స్ హీరోగా హంట‌ర్ అనే కొత్త సినిమా అనౌన్స్ అయింది. వెంక‌ట్ మోహ‌న్ అనే ద‌ర్శ‌కుడు రూపొందిస్తున్న ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. లారెన్స్ కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నున్న చిత్ర‌మ‌ట‌. ప్రి లుక్ పోస్ట‌ర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దీంతో పాటు బెంజ్ అనే మ‌రో సినిమాలోనూ హీరోగా న‌టిస్తున్నాడు లారెన్స్. ఈ చిత్రం లోకేష్ క‌న‌క‌రాజ్ నిర్మాణంలో అత‌డి క‌థ‌తో తెర‌కెక్క‌నుండ‌డం విశేషం. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. దీని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ కూడా భ‌లేగా ఉంది.

మ‌రోవైపు లారెన్స్ ఎప్ప‌ట్నుంచో క‌ల‌లు కంటుఉన్న ర‌జినీ సినిమా అవ‌కాశం కూడా అత‌డి చేతికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. లోకేష్ క‌న‌క‌రాజ్ రూపొందించ‌బోయే కొత్త చిత్రంలో అత‌ను ప్ర‌త్యేక పాత్ర చేయ‌నున్నాడ‌ట‌. అది ర‌జినీ హీరోగా న‌టించే సినిమా అన్న సంగ‌తి తెలిసిందే. మొత్తంగా లారెన్స్ కొత్త సినిమాల లైన‌ప్ చాలా ఎగ్జైటింగ్‌గా క‌నిపిస్తోంది.