వెతకాలే కానీ కొన్ని సెలబ్రిటీల నిజ జీవిత కథల్లో ఊహకందని డ్రామా ఉంటుంది. దాన్ని సరైన రీతిలో తెరకెక్కిస్తే ఆదరణ దక్కడం ఖాయం. అలాంటిదే నిన్న నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదలైన అమర్ సింగ్ చమ్కీలా. లవ్ ఆజ్ కాల్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో దిల్ జిత్ దోసాంజ్ టైటిల్ రోల్ పోషించగా లెజెండరీ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. పరిణితి చోప్రా హీరోయిన్. వివాదాస్పద గాయకుడిగా పేరున్న ఈ సింగర్ జీవితాన్ని రెండున్నర గంటల్లో చూపించిన వైనం ఆశ్చర్యపరచడమే కాదు షాక్ ఇచ్చే ఎన్నో సంగతులు చెప్పింది.
1988లో పంజాబ్ రాష్ట్రం మెహసంపూర్ గ్రామానికి ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్లిన చమ్కీలా, అతని రెండో భార్య అమర్ జీత్ ఇద్దరినీ పట్టపగలు కొందరు దుండగులు కాల్చి చంపేస్తారు. బూతు సాహిత్యంతో కూడిన పాటలు స్వంతంగా రాసుకుని పాడే చమ్కీలా వాటి ద్వారానే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. క్లాసు మాసు తేడా లేకుండా ప్రతి చోట ఇతని ఆల్బమ్స్ మారుమ్రోగిపోయేవి. వీటిని మానేయమని మత పెద్దలు, మిలిటెంట్లు హెచ్చరించినా మానుకోడు. దీంతో చివరికి చావును కొని తెచ్చుకుంటారు. అయితే హత్య చేసిన నిందితులు ఎప్పటికీ దొరక్కపోవడం అంతు చిక్కని రహస్యం.
ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా వివాదాలతోనే ఎక్కువ పాపులరైన చమ్కీలా లైఫ్ లో బోలెడు నాటకీయత ఉంటుంది. మొదటి భార్యకు చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవడం, బీడీలు తాగే అలవాటు, పంచాయితీ పెద్దలను తెలివిగా ఏమార్చడం ఇలా వ్యక్తిగత జీవితంలోనూ సినిమాని మించిన డ్రామా నడిపించాడు. ఆడియో కంపెనీలకు పంజాబీ సంగీతం కోట్లు కురిపించగలదని ఋజువు చేసిన వాళ్లలో అమర్ సింగ్ చమ్కీలా ప్రముఖుడు. కేవలం 28 సంవత్సరాల చిన్న వయసులో భార్యతో సహా దుర్మార్గుల చేతిలో కన్ను మూయడం మర్చిపోలేని విషాదం. అందుకే ఈ బయోపిక్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి.