కొన్ని వారాల కిందటే వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. ఐతే అది ఆయన అడిగి పెట్టించుకున్న భద్రత. అందుకు సంబంధించిన ఖర్చంతా రఘురామనే భరిస్తున్నట్లు వెల్లడైంది. ఐతే తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కూడా కేంద్రం ప్రత్యేక భద్రతను కల్పించింది. కానీ ఇక్కడ భద్రత ఖర్చు భరిస్తున్నది కంగనానా ప్రభుత్వమా అనే విషయంలో సందేహాలున్నాయి.
ఐతే ఇక్కడ రూపాయి కూడా కంగనా పెట్టుకోవట్లేదన్నది అధికార వర్గాల సమాచారం. ముంబయిలో అధికార శివసేన పార్టీతో కంగనా కయ్యం పెట్టుకోవడం, భారతీయ జనతా పార్టీ తెర వెనుక ఉండి ఆమెను ఉసిగొల్పుతుండటం, ఆమెకు మద్దతుగా నిలుస్తుండటం అందరికీ తెలిసిన విషయమే. శివసేన పార్టీ వాళ్లెంత దూకుడుగా ఉంటారో తెలిసిందే. వారి నుంచి కంగనాకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కంగనాకు ప్రభుత్వమే భద్రత కల్పించింది. ఇందుకోసం కంగనా కూడా విజ్ఞప్తి చేసి ఉండొచ్చు.
ఐతే కంగనాకు ‘వై’ కేటగిరి భద్రత కల్పించేందుకు నెలకు అయ్యే ఖర్చు రూ.10 లక్షలట. బ్రిజేష్ కాలప్ప అనే న్యాయవాది ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. అంటే ప్రజలు కట్టే పన్నుల డబ్బుతోనే కంగనాకు ఆ స్థాయి భద్రత కల్పిస్తున్నారన్నమాట. కాగా ముంబయిలో కంగనాకు ప్రాణహాని ఉందన్న కారణంతో ఆమె తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ నుంచి ఆ నగరానికి వస్తుంటే భద్రత ఏర్పాట్లు చేశారు.
ఐతే ముంబయిలో కొన్ని రోజుల పాటు ఉన్న కంగనా తిరిగి స్వస్థలానికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఇంత ఖర్చు పెట్టి ఆమె స్వస్థలంలోనూ భద్రత కల్పించడం ఎందుకు అని బ్రిజేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. దీనికి కంగనా ఘాటుగా బదులిచ్చింది. ప్రభుత్వానికి ఏం చేయాలో తెలుసని.. తనకు భద్రత అవసరం లేదనుకుంటే తీసేస్తారని.. ముప్పు ఉందంటే ఇంకా పెంచుతారని ఆమె ఆ న్యాయవాదికి రిప్లై ఇచ్చింది ట్విట్టర్లో.