తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు బ్లాక్ బస్టర్ కావడం వల్లే తర్వాత ఒక్క హిట్టు లేకపోయినా విజయ్ ఆంటోనీకి తెలుగులో ఇంకా మార్కెట్ దొరుకుతోంది. జయాపజయాల సంగతి పక్కనపెడితే రెగ్యులర్ కథల జోలికి వెళ్లకుండా ఏదో విభిన్నంగా ప్రయత్నిస్తూనే ఉండే ఈ కోలీవుడ్ హీరో తాజాగా లవ్ గురుతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో రోమియో టైటిల్ తో వచ్చిన ఈ ఎంటర్ టైనర్ రెండు భాషల్లో ఒకేసారి రిలీజయ్యింది. మృణాళిని రవి హీరోయిన్ గా నటించగా వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ పంపిణి చేసింది. ఇంతకీ లవ్ గురు ఎలా ఉన్నాడో చూద్దాం.
మూడు పదుల వయసు దాటిన అరవింద్ (విజయ్ ఆంటోనీ) మలేషియాలో లైఫ్ సెటిల్ చేసుకుని పెళ్లి గురించి ఊసే మర్చిపోతాడు. తల్లి తండ్రులు బలవంతం చేయడంతో ఇండియాకు వచ్చి లీల(మృణాళిని రవి)ని ఇష్టపడి మూడు ముళ్ళు వేస్తాడు. అయితే లీల జీవిత లక్ష్యం హీరోయిన్ కావడం. కేవలం కుటుంబం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికే తనను చేసుకుందని అర్థం చేసుకున్న అరవింద్ ఆమెకు ప్రేమతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. దీనికి చెల్లికి సంబంధించిన ఒక గతం కూడా ఉంటుంది. చివరికి అరవింద్ భార్య మనసును గెలుచుకునేందుకు ఏం చేశాడనేదే లవ్ గురు స్టోరీ.
రబ్ నే బనాది జోడిలో షారుఖ్, ఆయనకు ఇద్దరులో రమ్యకృష్ణ పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు వినాయక్ ఈ లవ్ గురు కథ రాసుకున్నాడు. వినోద కోణంలో ట్రీట్ మెంట్ కొంత ఫ్రెష్ గా అనిపించినా ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్ చేయడంలో జరిగిన తడబాటు వల్ల లవ్ గురు ఒక మాములు సినిమాగా మిగిలిపోయింది. నటనపరంగా విజయ్ ఆంటోనీలో మంచి పరిణితి కనిపించింది. యోగిబాబు కామెడీ పేలలేదు. సన్నివేశాలన్నీ ఊహించినట్టే నెమ్మదిగా జరుగుతాయి. కథలోనూ వైవిధ్యం లేదు. కాసింత వినోదం తప్ప లవ్ గురు పాఠాలు ప్రేక్షకులకు ఎక్కేలా లేవు.