విజయ్ కొత్త సినిమా ఆ రోజే..

ఒకప్పుడు తమిళ టాప్ హీరో విజయ్‌ను తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. తమిళంలో చిన్న హీరోల సినిమాలు కూడా తెలుగులో మంచి స్పందన తెచ్చుకునేవి. కానీ విజయ్ సినిమాలు అసలిక్కడ రిలీజయ్యేవే కావు. కానీ ‘తుపాకి’ తర్వాత కథ మారింది. గత పదేళ్లలో అతను తెలుగులో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అదిరింది, బిగిల్, మాస్టర్, లియో చిత్రాలకు ఇక్కడ మంచి స్పందన వచ్చింది.

‘లియో’కైతే తెలుగులో మిడ్ రేంజ్ హీరోల సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు విజయ్ చేస్తున్న, చేయబోయే సినిమాల మీద మన వాళ్లలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తున్న విజయ్.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

దీని తర్వాత మరో సినిమా చేసి.. రాజకీయాల్లోకి వెళ్తానని విజయ్ ప్రకటించడంతో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ మీద ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ముందు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకుని అంతకంటే నాలుగు నెలల ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 5నే ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ రిలీజవుతుందని ఈ రోజు చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో కథానాయికగా వడివడి అడుగులు వేస్తున్న మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో విజయ్ సరసన నటించడం విశేషం.

విజయ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీ ఆధారంగా వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్‌తో మాస్టర్ మూవీ తీసిన నిర్మాతలే ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.