చెప్పుకోదగ్గ హిట్టు కొట్టి ఏళ్ళు గడిచిపోయినా మాచో స్టార్ గోపిచంద్ మీద ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. కాకపోతే సరైన సక్సెస్ దక్కలేదన్న వెలితితో పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భీమా కంటెంట్ పరంగా నిరాశ పరిచినప్పటికీ కొన్ని బిసి సెంటర్లలో డీసెంట్ వసూళ్లతో మూడు వారాలు ఆడటం గమనించాల్సిన విషయం. త్వరలో విశ్వంగా రాబోతున్నాడు. అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న దర్శకుడు శ్రీను వైట్లకు కంబ్యాక్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. ఇవాళ టీజర్ ద్వారా కాన్సెప్ట్ ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.
ఎక్కడో ఉత్తరాది హిల్ స్టేషన్ లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. భుజాన బరువైన మెషీన్ గన్ వేసుకుని విశ్వం అక్కడికి నడుచుకుంటూ వస్తాడు. రావడం ఆలస్యం అందరి మీద తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తాడు. చిన్నా పెద్దా అడా మగా తేడా లేకుండా అందరూ నెలకొరగడం మొదలవుతుంది. అసలు ఇంత అరాచకం అతను ఎందుకు చేశాడు, పచ్చని పందిట్లో రక్తపాతం సృష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలకు సమాధానం విశ్వం థియేటర్లకు వచ్చాక తెలుస్తుంది. కామెడీ పంచులతో అలరించే శ్రీను వైట్ల దానికి భిన్నంగా పూర్తి వయొలెంట్ టచ్ తీసుకోవడం అనూహ్యం.
కథ గురించి ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికి నిర్ధారణకు రాలేం కానీ ఏదో డిఫరెంట్ గా ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇది హిట్ కావడం గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరికీ అవసరం. ప్రొడక్షన్ చేతులు మారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ భాగస్వామిగా చేరాక ఊపందుకుంది. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు. ఈ వేసవిలోనే ప్లాన్ చేస్తున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాకే క్లారిటీ వస్తుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. వీళ్ళిద్దరు కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లే కావడం గమనార్హం.